ఎంపీగా ప్రమాణం చేసిన కొద్ది గంటల్లోనే పదవికి గండం!!

 

ఎన్నికల్లో గెలవాలని, ప్రమాణస్వీకారం చేయాలని ప్రతి రాజకీయ నాయకుడు కలలు కంటాడు. అయితే ప్రమాణస్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే పదవి పోయే ప్రమాదం ఉందని తెలిస్తే.. ఆ నాయకుడి పరిస్థితి ఎలా ఉంటుంది?. ప్రస్తుతం ప్రముఖ నటుడు, ఎంపీ సన్నీ డియోల్ పరిస్థితి అలాగే ఉంది.

ఏదైనా ఎన్నిక జరిగే సమయంలో ఆ ఎన్నికలకు సంబంధించి వ్యయానికి ఈసీ పరిమితులు విధిస్తుంది. లోక్‌సభ ఎన్నికలకు కూడా రూ.70 లక్షల కన్నా ఎక్కువ ఖర్చు చేయొద్దని అభ్యర్థులకు స్పష్టం చేసింది. కానీ అప్పుడే రాజకీయాల్లో చేరి.. గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సన్నీ డియోల్ ఈ అంశాలేవి తెలియవనుకుంటా. ఒకవేళ తెలిసినా మిగతావారిలా ఎక్కువ ఖర్చు పెట్టి తక్కువ ఖర్చు పెట్టినట్టు చూపించడం చేతకాదేమో. అందుకే ఎంపీగా ఎన్నికై, ప్రమాణం చేసిన కొద్ది గంటలకే కష్టాలు తెచ్చుకున్నారు. ఎన్నికల్లో సన్నీ డియోల్ రూ.86 లక్షలు ఖర్చుచేసినట్టు ఈసీ గుర్తించింది. దీంతో ఆయనకు నోటీసులు జారీచేయాలని భావిస్తోంది.

ఎన్నికల్లో సన్నీ డియోల్ ఖర్చుకు సంబంధించి ఈసీ వద్ద పక్కా సమాచారం ఉంది. దీంతో ఎన్నికల వ్యయం పెరగడానికి గల కారణాలు ఏంటని నోటీసులు జారీచేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన ఇచ్చే సమాధానంపై ఈసీ సంతృప్తి చెందకుంటే మరోలా కూడా చర్యలు తీసుకోవచ్చు. సన్నీపై వేటు వేసి.. ఆ నియోజకవర్గంలో రెండోస్థానంలో నిలిచిన అభ్యర్థిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ఆయన పదవికి గండం వచ్చి పడింది.