పర్యావరణ గణపతి విగ్రహాన్ని పూజిద్దాం

సకల విఘ్నాలను తొలగిస్తూ, అన్ని ఆపదల నుంచి రక్షించే వినాయకుని వత్రం సందర్భంగా పర్యావరణ గణపతిని పూజించాలని దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రపంచ మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య  కరోనా వ్యాప్తి దీని నుంచి మనకు మనం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకోవాలంటే వాతావరణాన్ని శుద్ధి చేసే వేపమొక్కలను విరివిగా నాటాలన్నారు. మనల్ని మనం రక్షించుకోవటంతో పాటు, సమాజాన్ని రక్షించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. ఈ నేపథ్యంలో వినాయక  చవితి సందర్భంగా ఆధ్యాత్మికతకు ప్రకృతి, పర్యావరణ రక్షణను జోడించాలని వారు కోరారు. ఇందు కోసం ఈ వినాయక చవితికి విత్తన గణపతిని (సీడ్ గణేష్) అందరికీ పంపిణీ చేస్తామన్నారు.

లాంఛనంగా ఇవాళ విత్తన గణపతిని ఆవిష్కరించారు. 
పర్యావరణ హిత స్వచ్ఛమైన మట్టిలో వేప విత్తనాన్ని కలిపి గణపతిని తయారు చేసి పంపిణీ చేయటం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. అంతేకాదు మట్టిగణపతి విగ్రహన్ని అందరూ పూజకు ఉపయోగించేలా అవగాహన కల్పిస్తున్నారు.

కరోనా సమయంలో గణపతి వేడుకలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ,ఎవరికి వారే తమ ఇళ్లలోనే విత్తన గణపతిని ప్రతిష్టించుకునేలా, పూజల తర్వాత మొలకెత్తే వేప విత్తనాన్ని నాటు కోవచ్చునని తెలిపారు. తద్వారా ప్రతీ ఇంటి ఆవరణలో ఔషధ గుణాలున్న ఒక వేప చెట్టు ఉండాలన్న గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు ఆశయం కూడా సిద్దిస్తుందని సంతోష్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా వీలైనన్ని విత్తన గణేష్ లను పంపిణీ చేస్తామని, అదే సమయంలో ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చన్నారు. టీ ఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ఉత్సాహంగా విత్తన గణపతి పంపిణీలో పాల్గొనాలని సంతోష్ పిలుపు నిచ్చారు. ఆకుపచ్చని తెలంగాణ సాధనలో ఇది కూడా ఒక సాధనంగా ఉపయోగపడు తుందన్నారు.