రాత్రికి నా భర్తను చంపాలని చూస్తున్నారు..
Published on: Sun May 16, 2021 5:44PM
హత్యలు చేసేవారు రోడ్లపై తిరుగుతున్నారు.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వాళ్లని జైల్లో పెడతారా? ఏపీలో అసలేం జరుగుతోందో తనకు అర్థం కావడం లేదంటూ ఎంపీ రఘురామ సతీమణి రమాదేవి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తన భర్తను బాగా కొట్టారని చెప్పారు. కోర్టు నిబంధనలు పట్టించుకోరా? అని ఆమె ప్రశ్నించారు. రమేశ్ ఆస్పత్రికి తరలించాలని కోరితే.. పట్టించుకోలేదని వాపోయారు. ఈ రోజు రాత్రి తన భర్తను చంపాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు రమాదేవి.
ఇప్పటికే, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వైద్యపరీక్షల అనంతరం జీజీహెచ్ క్యాన్సర్ ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తీసుకెళ్లారు. రఘురామ తరలింపు నేపథ్యంలో జిల్లా జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రఘురామ ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో సరైన వైద్యం అందించాలని కోర్టు సూచించింది. మొదట జీజీహెచ్, ఆ తర్వాత రమేశ్ హాస్పిటల్‌లో ఆయనకు చికిత్స అందించాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రఘురామను జైలుకు తరలించారు పోలీసులు. మరోవైపు రఘురామకృష్ణరాజుకు అయిన గాయాలపై జిల్లా కోర్టుకు మెడికల్ బోర్డు నివేదిక ఇవ్వనుంది.


