TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం

Published on: Sun Feb 7, 2021 6:03PM

తెలంగాణలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా ఉన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సుడిగాలిలా పర్యటిస్తూ 
కేడర్ లో  జోష్ నింపుతున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడికెళ్లినా జనాలు భారీగా వస్తున్నారు. రేవంత్ రెడ్డి పంచ్ ప్రసంగాలకు ఫిదా అవుతున్నారు. దీంతో రోజు రోజుకు ఆయన గ్రాఫ్ పెరుగుతోంది.కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. ఇదే అస్త్రంగా జనంలోకి వెళుతోంది కాంగ్రెస్. కేంద్రంతో పాటు కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ 
దూసుకుపోతున్నారు రేవంత్ రెడ్డి. 

  తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి ఆకస్మికంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్షలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. సభలో పాల్గొన్న మాజీ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్కలు రేవంత్ రెడ్డిని పాదయాత్ర చేయాలని కోరారు. వాళ్ల ప్రతిపాదనను  ఆమోదిస్తూ పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేస్తున్నానని ప్రకటించి.. రైతు భరోసా దీక్షనే పాదయాత్రగా మార్చేశారు. అంతేకాదుఅచ్చంపేట నుంచి హైదరాబాద్ కు అప్పటికప్పుడే పాదయాత్ర మొదలు పెట్టేశారు. అచ్చంపేట సభకు వచ్చిన వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డితో పాటు పాదయాత్రగా హైదరాబాద్ వస్తున్నారు.

 ఎంపీ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తెలంగాణలో సంచలనంగా మారింది. తెలంగాణ కాంగ్రెస్ కేడరంతా రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొనేందుకు ఇతర జిల్లాల నుంచి నేతలు అచ్చంపేటకు బయలు దేరారని తెలుస్తోంది. ఇటీవల నిజామాబాద్ రైతు భరోసా దీక్ష కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సభలో బీజేపీ, టీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు రేవంత్ రెడ్డి. నిజామాబాద్ సభలో ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ కు బూస్ట్ వచ్చిందని చెబుతున్నారు.