షర్మిల పరువు తీసిన రేవంత్ రెడ్డి! 

తెలంగాణలో కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల దూకుడుగా వెళుతున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ పార్టీకి మద్దతు కూడగడుతున్నారు. అయితే షర్మిల సమావేశాలు వివాాదాస్పదం కూడా అవుతున్నాయి. ఎంపిక చేసిన కొందరు నేతలను పిలిపించి.. ఏదో జరుగుతున్నట్లు మీడియాలో ప్రచారం చేస్తూ హంగామా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల లోటస్ పాండ్ లో విద్యార్థులతో జరిగిన సమావేశంలో ఓ విద్యార్థి ఉద్వేగంగా ప్రసగించాడు. ఆ విద్యార్థిని వేదికపైకి పిలిచి ఓదార్చారు షర్మిల. అతనికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. 
   
షర్మిల సమావేశానికి సంబంధించి సంచలన విషయాలు బయటపెట్టారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి. షర్మిలతో మాట్లాడిన యువకుడి పేరు సునంద్ జోసెఫ్ అని చెప్పారు. ఆ యువకుడు విద్యార్థి కాదు, నిరుద్యోగి కాదని అన్నారు. కల్వరి టెంపుల్ లో అర్కెస్ట్రా వాయిద్యాన్ని వాయిస్తుంటాడని చెప్పారు రేవంత్ రెడ్డి. జోసెఫ్ తండ్రి  వైయస్ చనిపోవడానికి ముందే చాలా ఏళ్ల క్రితమే మరణించాడని తెలిపారు.కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ డ్రామా ఆడారని విమర్శించారు. స్టేజి మీద డ్రామాను రక్తికట్టించారని... ఈ డ్రామాకు ఆస్కార్ అవార్డు కూడా తక్కువేనని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ డ్రామాకు తెర లేపారని చెప్పారు. షర్మిలతో కనిపించిన యువకుడి ఫేస్ బుక్ ప్రొఫైల్ లో హరీశ్ రావుతో దిగిన ఫొటోలను చూడొచ్చని అన్నారు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో వైఎస్ షర్మిల అసలు బండారం బయటపడిందనే చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ పేరుతో జరుగుతున్న డ్రామాలను ఇప్పటికైనా ఆపాలని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. షర్మిల పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి.