కేసీఆర్ పై రేవంత్ లేఖాస్త్రం 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మరోసారి టార్గెట్ చేశారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. కేంద్ర రైతు చట్టాలు, శనగ రైతుల కష్టాలు, పంట కొనుగోలు కేంద్రాలకు సంబంధించి సీఎం కేసీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. 

నల్ల వ్యవసాయ చట్టాల అమలు పై ప్రధాని మోడీ కంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆరే అత్యుత్సాహంగా ఉన్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతు ఉద్యమానికి భయపడి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ చట్టాల అమలుకు వెనుకంజ వేస్తున్నాయన్నారు. మోడీ ప్రాపకం కోసం రైతుల ప్రయోజనాలు తాకట్టు పెడతారా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కొనుగోలు కేంద్రాల ఎత్తివేత, పంటను ప్రభుత్వం కొనదు అన్న  ప్రకటనలు మోడీని సంతోష పెట్టడానికే కదా అని నిలదీశారు. 

ప్రభుత్వ ఉదాసీనతతో శనగ రైతులు నష్టపోతున్నారని చెప్పరు. మార్కెట్ మొత్తం దళారుల గుప్పిట్లోకి వెళ్లిపోయిందన్న రేవంత్..మద్ధతు ధర  రైతుకు దక్కడం లేదన్నారు. తక్షణం మార్క్ ఫెడ్ ద్వారా శనగ పంట కొనిపించాలని తన లేఖలో సీఎం కేసీఆర్ ను కోరారు ఎంపీ రేవంత్ రెడ్డి.రాష్ట్రంలో మరో 20 రోజుల్లో యాసంగి పంట వస్తోందన్నారు  రేవంత్ రెడ్డి. ప్రభుత్వం పంట కొనదేమో అన్న ఆందోళన రైతుల్లో ఉందన్నారు. తక్షణం పంట కొనుగోలు కేంద్రాలు పునరుద్ధరించాలని కోరారు.రైతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే మూల్యం తప్పదని ముఖ్యమంత్రి కేసీఆర్ ను హెచ్చరించారు రేవంత్ రెడ్డి.