టీఆర్ఎస్, బీజేపీలను తరిమికొడతామన్న రేవంత్ రెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేశారు తెలంగాణ  కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీ తోడు దొంగలన్నారు రేవంత్ రెడ్డి. జీఎస్టీ. సీఏఏ బిల్లులతో పాటు నోట్ల రద్దుకు  కేసీఆర్ సపోర్ట్ చేశారని చెప్పారు. మోడీ, అమిత్ షాకి  లొంగిపోయి.. ఈడి, సీబీఐకి  బయపడి కేసీఆర్ యూ టర్న్ తీసుకున్నారని విమర్శించారు. కేసీఆర్ కాళేశ్వరం దోపిడీ , విద్యుత్ దోపిడి,  యాదాద్రి పై  విచారణకు ప్రధాని ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీజేపీ కార్పోరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందన్నారు.  మోడీ, కేసీఆర్ కలిసి రైతులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. 
  
కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి  మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు.  కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ప్రధాని మోడీ వైపు ఉంటారో లేకుంటే రైతుల వైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్రం చర్చల పేరిట కాలయాపన చేస్తోందన్న రేవంత్‌రెడ్డి.. మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగానే కాంగ్రెస్ నేతలను కేసీఆర్ సర్కార్ అరెస్ట్‌  చేస్తోందని  విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్  రెడ్డి పంట కొనుగోలు చేయమని బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. పంట కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలని.. లేదంటే టీఆర్ఎస్, బీజేపీలను గాలికి తూర్పారపడతామని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.