కాంగ్రెస్ లో ఒకే ఒక్కడు! ఆయనపైనే గ్రేటర్ ఆశలు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. గెలుపు కోసం అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలో దూకుడుగా కనిపిస్తుండగా.. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మాత్రం వెనకబడిపోయినట్లు కనిపిస్తోంది. ముందు కొంత ఉత్సాహంగా ఉన్నా పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ అభ్యర్థులు కాడి ఎత్తేస్తున్నట్లు కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఒక్కడే గ్రేటర్ లో కాంగ్రెస్ గెలుపు  కోసం ముమ్మర ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డ ప్రచారానికి ప్రజల్లోనూ మంచి స్పందన కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి కూడా రోజు 10 డివిజన్ల వరకు రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే  ఆయనకు మద్దతుగా ఇతర కాంగ్రెస్ నేతలెవరు గ్రేటర్ ప్రచారంలో యాక్టివ్ గా కనిపించడం లేదు. పీసీసీ ముఖ్య నేతలు కూడా హైదరాబాద్ ప్రచారంలో అంతంత మాత్రంగానే కనిపిస్తున్నారు. 

 

గ్రేటర్ ఎన్నికలను సవాల్ గా తీసుకున్న బీజేపీ ప్రచారంలో  కేంద్రమంత్రులు, ఇతర రాష్ట్రాలు సీఎంలు, ఆ పార్టీ జాతీయ నేతలు పాల్గొంటున్నారు. టీఆర్ఎస్ అయితే రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులందరిని గ్రేటర్ లోనే మోహరించింది. డివిజన్ కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీని ఇంచార్జ్ గా పెట్టడంతో .. వారంతా గల్లి గల్లీ తిరిగి టీఆర్ఎస్ అభ్యర్థుల కోసం ఓట్లు అడుగుతున్నారు. ర్యాలీలు, సభలు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఉదయం హుషార్ హైదరాబాద్ సభలు, సాయంత్రం రోడ్ షోలు నిర్వహిస్తూ కారు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. కాంగ్రెస్ లో మాత్రం రేవంత్ రెడ్డి ఒక్కడే ఆ పార్టీ అభ్యర్థులకు దిక్కయ్యారని చెబుతున్నారు. ఇతర నేతలు చురుకుగా లేకపోవడం, ప్రచారానికి వచ్చినా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో.. కాంగ్రెస్ అభ్యర్థులంతా తమ డివిజన్ లో ప్రచారం చేయాలని రేవంత్ రెడ్డిని అభ్యర్థిస్తున్నారని చెబుతున్నారు. అయితే సమయం తక్కువగా ఉండటంతో రేవంత్ రెడ్డి కూడా అన్ని డివిజన్లకు వెళ్లలేకపోతున్నారని చెబుతున్నారు.

 

తమ  పార్టీ నేతల సహకారం లేకపోవడం.. టీఆర్ఎస్, బీజేపీ దూకుడుగా ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థులు చాలా మంది గ్రేటర్ రేసు నుంచి ముందే తప్పుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కొంత మంది అభ్యర్థులు ప్రచారం కూడా ఆపేశారని చెబుతున్నారు. అధికార పార్టీతో పాటు బీజేపీ అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తుండటంతో.. వారిని తట్టుకోవడం సాధ్యం కాదని భావిస్తున్న కొందరు కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం సమయంలోనే హ్యాండప్ అంటున్నారని సమాచారం. గ్రేటర్ లో 150 డివిజన్లు ఉండగా... పాతబస్తిలోనే 50 వరకు ఉన్నాయి. అక్కడ ఎంఐఎంకి తప్ప ఏ పార్టీకి ఆశలు ఉండవు. మిగిలిన వంద డివిజన్లలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. ఇందులో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థులు కేవలం 20 నుంచి 25 స్థానాల్లో మాత్రం ప్రత్యర్థులకు పోటీ ఇస్తుందని తెలుస్తోంది. ముందు దాదాపు 60 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉత్సాహంగానే ప్రచారం చేసినా.. పరిస్థితులను బట్టి చాలా మంది హస్తం అభ్యర్థులు వెనక్కి తగ్గారని చెబుతున్నారు.

 

కాంగ్రెస్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్న డివిజన్లు అన్ని మల్కాజ్ గిరి లోక్ సభ పరిధిలోనే ఉన్నాయని తెలుస్తోంది. ఎంపీ రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్లే అక్కడ కాంగ్రెస్ పోటీ ఇస్తుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తన ఎంపీ పరిధిలోకి వచ్చే మల్కాజ్ గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపారు రేవంత్ రెడ్డి. వారి కోసం ప్రచారం కూడా ముమ్మరంగా చేస్తున్నారు. దీంతో ఈ నాలుగు నియోజకవర్గాల పరిధిలోనే కాంగ్రెస్ అభ్యర్థులు రేసులో ఉన్నారని, మిగితా అన్ని నియోజకవర్గాల్లో ముందే చేతులెత్తేశారని చెబుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రచారానికి మంచి స్పందన వస్తుండటంతో కుత్బుల్లాపూర్, ఉప్పల్, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు మంచి ఫలితాలు రావచ్చని చెబుతున్నారు. ఎల్బీ నగర్ లో రేవంత్ రెడ్డి క్రేజీ  ఉన్నప్పటికి.. కొందరు ముఖ్యనేతలు బీజేపీలో చేరడంతో  కాంగ్రెస్ కు బలమైన అభ్యర్థులు దొరకలేదని తెలుస్తోంది. మొత్తంగా గ్రేటర్ కాంగ్రెస్ గెలుపు భారమంతా రేవంత్ రెడ్డిపైనే పడిందని, ఆయన కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. మరీ ఒకే ఒక్కడుగా పోరాడుతున్న రేవంత్ రెడ్డి.. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ కు ఎన్ని సీట్లు సాధించి పెడతారో చూడాలి మరీ...