సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆన్ లైన్ పిటిషన్! ఎంపీ రామ్మోహన్ నాయుడికి భారీ మద్దతు
Published on: Mon Feb 8, 2021 9:57AM
విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు ఇది 1963లో మార్మోగిన నినాదం. కేంద్ర సర్కార్ దిగొచ్చేలా చేసిన ఉద్యమ గళం. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మళ్లీ ఆ నినాదం మార్మోగుతోంది. పోరాడి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రులు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. తమ హక్కును కాపాడుకునేందుకు కదులుతున్నారు. రాజకీయ నాయకులు కూడా కలిసి వస్తుండటంతో విశాఖ ఉద్యమం ఊపందుకుంటోంది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడి ఆన్లైన్ పోరాటం మొదలు పెట్టారు. ఆయన వేసిన ఆన్ లైన్ పిటిషన్ కు వేలాది మంది మద్దతు లభిస్తోంది.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా ‘చేంజ్ డాట్ ఆర్గ్’లో ‘సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్’ పేరుతో ఎంపీ పిటిషన్ ప్రారంభించారు. కొన్ని గంటల్లో రామ్మోహన్ నాయుడు పిటిషన్ కు వేలాది మంది సపోర్ట్ చేశారు. దీనికి ఆదివారం రాత్రి 12 వరకు 31,715 మంది మద్దతు తెలిపారు. గంట గంటకు సంఖ్య వేగంగా పెరుగుతోంది.
ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆ పిటిషన్లో రామ్మోహన్ డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌కు లక్ష మంది మద్దతు తెలిపిన అనంతరం దానిని ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర ఆర్థిక, ఉక్కుశాఖ మంత్రులకు అందిస్తామని రామ్మోహన్ నాయుడు తెలిపారు.


