TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పార్లమెంటుపైనే ఏపీ సర్కార్ దాడి! ఎంపీలకు రఘురామ రాజు లేఖలు.. 

Published on: Fri Jun 4, 2021 9:42AM

రాజద్రోహం కేసులో అరెస్ట్ అయి సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలైన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఢిల్లీ వేదికగా తన పోరాటం కొనసాగిస్తున్నారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రానికి ఆయన ఫిర్యాదుల మీదు ఫిర్యాదులు చేస్తున్నారు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్ పి.సుధాకర్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రఘురామ కష్ణరాజు ఏపీ బార్‌కౌన్సిల్‌కు కంప్లైంట్  చేశారు.తాజాగా వివిధ పార్టీల ఎంపీలు, పార్లమెంటు న్యాయ, ప్రజా ఫిర్యాదుల స్థాయీ సంఘం చైర్మన్ భూపేంద్రయాదవ్‌తోపాటు సభ్యులకు లేఖలు రాశారు ఎంపీ రఘురామ రాజు. తన అరెస్ట్, తదనంతర పరిణామాల గురించి ఆ లేఖల్లో వివరించారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ఎత్తిచూపినందుకే తనపై కేసు నమోదు చేశారని తెలిపారు.

ఏపీ సీఎం జగన్‌పై 11 సీబీఐ, 6 ఈడీ కేసులు ఉన్నాయని, వాటిలో ఆయన ఏ1 నిందితుడిగా ఉన్నారని రఘురామ గుర్తు చేశారు. ఆయనతోపాటు కేసులు ఎదుర్కొంటున్నవారు జగన్ మంత్రివర్గంలో సభ్యులుగా, రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారని లేఖలో పేర్కొన్నారు.వ్యక్తిగత కక్షతోనే తనపై రాజద్రోహం కేసు నమోదు చేశారని రఘురామరాజు ఆరోపించారు. గుండె ఆపరేషన్ చేయించుకున్న తనపై ముసుగులు ధరించిన ఐదుగురు వ్యక్తులు దాడి చేశారని చెప్పారు. కాళ్లపై లాఠీలు, రబ్బరు బెల్టులతో కొట్టారన్నారు. ఈ సందర్భంగా కాళ్లు గాయాలయ్యాయంటూ వాటి ఫొటోలను లేఖలకు జత చేశారు. ఒక ఎంపీపై జరిగిన దాడిని పార్లమెంటుపై జరిగిన దాడిగానే పరిగణించాలని కోరారు.

ఎంపీ రఘురామ రాజు నుంచి తనకు అందిన లేఖను తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్, ఎంపీ మాణికం ఠాగూర్ ట్విట్టర్‌లో పెట్టడంతో లేఖల విషయం వెలుగుచూసింది. ఈ లేఖను చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని మాణికం ఠాగూర్ అన్నారు. ఏపీ ప్రభుత్వ క్రూరత్వానికి ఇది నిదర్శనమన్నారు. ఎంపీకే ఇలా జరిగితే సామాన్య రాజకీయ కార్యకర్తల పరిస్థితి ఏంటని మాణికం ఠాగూర్ ఆవేదన వ్యక్తం చేశారు.