TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రఘురామ మరో సంచలనం.. మాములుగా లేదుగా! 

Published on: Sun May 30, 2021 6:29PM

ఢిల్లీ వేదికగా తన పోరాటం ముమ్మరం చేశారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు. తన అరెస్టు సమయంలో జరిగిన పరిణామాలపై కేంద్రం పెద్దలతో నివేదిస్తున్న రఘురామ.. మరోసారి సంచలనానికి తెర తీశారు. ఈసారి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ రిజిస్ట్రార్ కేపీ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను ఆర్మీ ఆస్పత్రి నుంచి త్వరగా డిశ్చార్జ్‌ చేసేందుకు.. వైద్యులపై కేపీరెడ్డి ఒత్తిడి తెచ్చారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు రఘురామ ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి రాజ్‌నాథ్‌సింగ్‌కు మూడు పేజీల లేఖను అందజేశారు. 

ఆర్మీ హాస్పిటల్ రిజిస్ట్రార్  కేపీ రెడ్డి, టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి, గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డిలు తనను ఏపీ సీఐడీకి అప్పగించేందుకు కుట్రపన్నారని ఫిర్యాదులో తెలిపారు ఎంపీ రఘురామ రాజు. ఏపీ మఫ్టీ పోలీసులు ఆర్మీ ఆస్పత్రిలో మకాం వేసేందుకు కేపీ రెడ్డి సహకరించారని ఆరోపించారు. 15 మంది ఏపీ పోలీసుల మెస్ బిల్లులను కూడా తన లేఖకు రఘురామ జతపర్చారు. కేపీ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి చేశారు. తన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్‌సింగ్ హామీ ఇచ్చారని చెప్పారు ఎంపీ రఘురామ.