TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? వైసీపీ నేతలను చీల్చి చెండాడిన రఘురామ.. 

Published on: Tue Dec 7, 2021 2:05PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైసీపీ నేతలపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి విరుచుకుపడ్డారు. లోక్ సభలో వైసీపీ ఎంపీలు దిగజారి వ్యవహరించారని ఆయన మండిపడ్డారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు తాను బీజేపీలో చేరుతున్నారన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? రాస్కెల్స్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘురామ కృష్ణం రాజు. అసలు బీజేపీతో అంటకాగిందే వైసీపీ నేతలని ఆరోపించారు. ఏది చేసినా బీజేపీకి చెప్పే చేస్తామంటూ గతంలో విజయసాయిరెడ్డి చెప్పారని ఎంపీ రఘురామ  గుర్తు చేశారు.

ప్రభుత్వ  అరాచకాల మీద పోరాటం చేస్తున్నందుకు తన మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రఘురామ అన్నారు. పాపాలను ప్రశ్నిస్తే బూతులు తిడతారా? అంటూ మండిపడ్డారు. దౌర్జన్యపు సైన్యంలా వలంటీర్ వ్యవస్థ ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లకు జీతమిస్తున్నామని చెప్పి ఉద్యోగులకు జీతం ఇవ్వట్లేదని ఆరోపించారు.రైతులు అమరావతి కోసం భూములిస్తే.. విశాఖపట్నంలో దుకాణం తెరుస్తామంటూ ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. అమరావతి నుంచి ఒక్కొక్క కార్యాలయాన్ని తరలిస్తున్నారని మండిపడ్డారు.  

స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం గురించి మాట్లాడినప్పటి నుంచే తనపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఎంపీ రఘురామ అన్నారు. రాజ్యాంగ విరుద్ధమని చెబితే తనపై అనర్హత వేటు వేయించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. చరిత్రలో జగన్ కూడా గుర్తుండిపోతారని, ఎప్పుడైనా విలన్, హీరోలందరికీ గుర్తింపు ఉంటుందని చెప్పారు. రాముడు, రావణాసురుడు, కృష్ణుడు, కంసుడు.. అంతా గుర్తున్నా వారి వారి చర్యలకు తగ్గట్టు గుర్తుండిపోయారన్నారు. జగన్ కూడా ముస్సోలిని, హిట్లర్, జార్ చక్రవర్తి తరహాలోనే దుర్మార్గుడి జాబితాలో గుర్తుండిపోతారనే తన బాధంతా అని ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు.