అమరావతిలో పెయిడ్ ఆర్టిస్టుల గోల... రఘురామరాజు సంచలన కామెంట్స్ 

ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ అక్కడి రైతులు, ప్రజలు 300 రోజులుగా ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. ఐతే ఈ ఉద్యమాన్ని ఎలాగైనా భగ్నం చేసి తాము కోరుకున్న విధంగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనీ వైసిపి సర్కార్ విశ్వప్రయత్నం చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అమరావతి పరిరక్షణ కోసం రైతులు ఉద్యమం చేపట్టి.. 300 రోజులు పూర్తీ కావడంతో పాటు ప్రధాని మోడీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకుని ఉద్దండరాయనిపాలెంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు, ప్రజలు ఒకరోజు నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో వైసీపీ సర్కార్ కు మళ్ళీ టెన్షన్ మొదలైంది.

 

ఇప్పటిదాకా తమపార్టీ నేతలతో విశాఖ కర్నూల్ ప్రాంతాల్లో మూడు రాజధానుల అనుకూల ప్రదర్శనలు చేయించిన సర్కార్ ఇపుడు ఏకంగా అమరావతి ప్రాంతంలోనే బలప్రదర్శన చేయాలనే వ్యూహాన్ని అమల్లోకి తెచ్చేసింది. గతంలో కూడా దళిత రైతుల పేరుతో వైసీపీ అనుకూల క్యాంపులు నిర్వహించి... చంద్రబాబునాయుడి పర్యటనలో.. చెప్పులు కూడా వేయించినా అవన్నీ బయటపడిపోయాయి. తాజాగా నిన్న తాము కూడా ప్రదర్శన నిర్వహిస్తామని.. మూడు రాజధానులకు అనుకూలమంటూ కొందరు పోలీసులను పర్మిషన్ అడిగినట్లు.. దానికి వారు ఒక టైమ్ ఫిక్స్ చేసినట్లు హైడ్రామా నడిచింది. ఐతే ఈ విషయం తెలుసుకున్న అక్కడి రైతులు భగ్గుమన్నారు. దీంతో ఏదేమైనా సరే అని.. మళ్లీ కొందరిని చివరి నిమిషంలో ఆటోల్లో తరలించి.. ఆ ప్రాంతంలో గొడవలు రేపటానికి కూడా ప్రయత్నించారు.

 

ఐతే ఈ మొత్తం ఉదంతం పై వైసిపి రెబల్ ఎంపీ రఘురామరాజు స్పందిస్తూ.. అమరావతి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ ప్రయత్నించిందని అన్నారు. కర్నూల్‌లో ఒక రాజధాని, విశాఖలో ఒక రాజధాని కావాలని అసలు బుద్ధున్నోడు ఎవడైనా అడుగుతాడా? అమరావతి వాడు కర్నూల్‌లో ఒకటి.. వైజాగ్‌లో ఒకటి కావాలని అడుగుతాడా? అన్నం తింటున్నారా.. గడ్డితింటున్నారా... ఇది కేవలం పెయిడ్ ఆర్టిస్టుల పని అని అర్థమువుతోంది. వైసిపి వాళ్ళు చిన్నపిల్లల్లా, తెలివితక్కువతనంతో ప్రవర్తిస్తున్నారు. ఇంగిత జ్ఞానం ఉన్నోళ్లకి ఇది చాలా ఈజీగా అర్థమవుతోంది. నాలుగు గంటలకల్లా ... ఆటోలో కొంతమంది అక్కడికి చేరుకున్నారంటూ అయన తన దగ్గరున్న మొబైల్‌లోని ఓ ఫొటో చూపించారు. వైసీపీ లోకల్ ఎమ్మెల్యేనే పెయిడ్ ఆర్టిస్టుల సప్లయిర్ అని అయన తీవ్ర ఆరోపణలు చేసారు. అసలు ప్రజాప్రతినిధే ఒక జూనియర్ ఆర్టిస్ట్ రోల్ తీసుకున్నారన్నారు. వాళ్లకు వెయ్యి రూపాయలు ఇచ్చారట. ఐతే ఆటోలో వచ్చిన వారికి... ఎందుకు వెళుతున్నారో కూడ తెలియదని అయన అన్నారు.