సీఎం జగన్ కు రఘురామకృష‌్ణంరాజు లేఖ.. యాంటీ క్రిస్టియన్‌గా చిత్రీకరించారు!!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష‌్ణంరాజు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌ పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల వెల్లడైన సీ-ఓటర్ ఫలితాల్లో ఉత్తమ సీఎంగా నాలుగో స్థానం సాధించినందుకు గాను జగన్‌ కు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మొదటి స్థానం సాధించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

విజయసాయిరెడ్డి నుంచి ఇటీవల తనకు షోకాజ్‌ నోటీసు అందిందని, దానిపై స్పందిస్తూ ఈ లేఖ రాస్తున్నట్లు రఘురామ కృష‌్ణంరాజు తెలిపారు. రిజిస్టరయిన పార్టీ కాకుండా తనకు మరో పార్టీ లెటర్‌ హెడ్‌తో నోటీసు వచ్చిందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకోవద్దని ఎన్నికల సంఘం చెప్పిందని తెలిపారు. ఏ సందర్భంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని వాడుకునేందుకు అవకాశం లేదని ఈసీ చెప్పిందని పేర్కొన్నారు. 

తాను వెంకటేశ్వరస్వామికి భక్తుడినినని చెప్పిన ఆయన.. స్వామివారి ఆస్తుల అమ్మకం విషయంలో భక్తుల మనోభావాలను మాత్రమే తాను వివరించి చెప్పానని తెలిపారు. అంతేగానీ, తాను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. తనను కొందరు యాంటీ క్రిస్టియన్‌గా చిత్రీకరించారని ఆరోపించారు. అలాగే ఇంగ్లీష్ మీడియంపై గతంలో తాను చెప్పిన అభిప్రాయాలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇంగ్లీష్ మీడియంపై పార్లమెంట్‌లో మాట్లాడానని.. సీఎం కూడా చాలా సంతృప్తి చెందారని రఘురామ కృష‌్ణంరాజు పేర్కొన్నారు.

తనపై వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేనని ఆయన లేఖలో పేర్కొన్నారు. తాను పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను అని, పార్టీ ఆదేశాలను తాను ఏనాడు థిక్కరించలేదని పేర్కొన్నారు. మీ నాయకత్వాన్ని సమర్థిస్తానని అన్నారు. తనపై కొందరు కావాలని కుట్ర చేస్తున్నారని, మీకు దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని రఘురామ కృష‌్ణంరాజు ఆరోపించారు.