వైసీపీ వేధింపులు.. స్పీకర్కి ఎంపీ గీత ఫిర్యాదు..
Published on: Wed Sep 24, 2014 6:13PM

వైసీపీలో తన పట్ల జరుగుతున్న వేధింపులపై పార్లమెంట్ స్పీకర్కి ఫిర్యాదు చేశానని ఎంపీ కొత్తపల్లి గీత వెల్లడించారు. బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘పార్టీలో నాకు జరుగుతున్న అన్యాయంపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఒక వైసీపీ ఎమ్మెల్యే నేను ఎస్టీని కాదని ప్రచారం చేస్తున్నారు. అది ఆ ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయమా లేక పార్టీ అభిప్రాయమా అనేది వైసీపీ స్పష్టం చేయాలి. నేను ఎస్టీ కాకుండానే వైసీపీ తనకు బీఫామ్ ఇచ్చిందా? దళితురాలైన మహిళా ఎంపీ అయిన నన్ను వైసీపీలో చులకనభావంతో చూస్తున్నారు. నేను ప్రజాసేవకోసమే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప జనం సొమ్ము కాజేయడానికి కాదు. నేను ఎవరి ఆస్తులూ కాజేయలేదు. నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసే ధైర్యం లేక వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. మహిళా ఎంపీ అయిన నా మీద సామాజిక వైబ్సైట్లలో కొంతమంది అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా పార్టీ ఎంతమాత్రం పట్టించుకోలేదు’’ అని కొత్తపల్లి గీత అన్నారు.


