రాధాపై రెక్కీ నిర్వహించింది వాళ్లేనా? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది?
Published on: Mon Jan 3, 2022 3:45PM
తనను చంపడానికి రెక్కీ నిర్వహించారంటూ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాధాపై రెక్కీ ఎవరూ నిర్వహించారన్నది ఇంకా తేలకున్నా.. రోజుకో ప్రచారం తెరపైకి వస్తోంది. ఆ ఘటనపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. రాధా ఇంటి దగ్గర గుర్తు తెలియని వాహనం చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది. రాధాను చంపడానికి రెక్కీ చేసింది వైసీపీ దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడు వెంకట సత్యనారాయణ అలియాస్ అరవ సత్యమేనని జోరుగా ప్రచారం జరుగుతోంది. సత్యంను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఆయనకు బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరారని చెబుతున్నారు. కానీ దీన్ని అరవ సత్యం కుటుంబ సభ్యులు కొట్టిపారేశారు. సత్యంను పోలీసులు తీసుకువెళ్లలేదన్నారు. ఆయన అనారోగ్యకారణంగా ఆస్పత్రిలో చేరారని అతని కుమారుడు చరణ్ తెలిపాడు.
తాజాగా వంగవీటి రాధా రెక్కీ అంశంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు ఎన్టీఆర్, చంద్రబాబు ఎప్పుడూ హత్యారాజకీయాలు ప్రోత్సహించలేదని తెలిపారు. వంగవీటి రాధా, రంగా అనుచరులు స్వార్థ ప్రయోజనాల కోసం.. హత్యారాజకీయాలు చేయడంతో రంగా చనిపోయారని చెప్పారు. టీడీపీ ఆఫీస్‌పై, పట్టాభి ఇంటిపై ఎవరైతే దాడి చేశారో.. వారే రాధా ఆఫీసు దగ్గర రెక్కీ నిర్వహించారంటూ పరోక్షంగా దేవినేని నెహ్రూ కుటుంబంపై ఆరోపణలు చేశారు కేశినేని నాని.
మరోవైపు వంగవీటి రాధాపై సీపీ క్రాంతి రాణా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. రాధా రెక్కిపై సరైన ఆధారాలు దొరకలేదని ఆయన భద్రతకు పూర్తి భరోసా ఇస్తున్నామన్నారు. ఈ ఘటనపై తమకు ఎవరి వద్ద నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. రాధా హత్యకు రెక్కీపై ఎవరైనా సమాచారం ఇస్తే విచారణ చేస్తామని అన్నారు. రాధాకు గన్‌మెన్లను కేటాయించామని, నగర పోలీసులు కూడా ఆయనకి భద్రత కల్పిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పోలీసులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయలేమని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించామని, 2 నెలల ఫుటేజ్ ఉందని తెలిపారు. రాధా ఇంటి దగ్గర చక్కర్లు కొట్టాయన్న వాహనంపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. రాధాని పోలీసులు కలిసి మాట్లాడి వివరాలు తీసుకున్నారని చెప్పారు. రాధా ఇంటి దగ్గర రెక్కీ జరిగినట్టు ఇంకా నిర్ధారణ కాలేదని, విచారణ కొనసాగుతోందని క్రాంతి రాణా స్పష్టం చేశారు.


