ఎంపీ కేశవరావుకు కరోనా.. టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్
Published on: Wed Dec 29, 2021 3:56PM
తెలంగాణలో కొవిడ్ మళ్లీ పంజా విసురుతోంది. రోజురోజుకు కొత్త కేసుల సంఖ్య పెరిగిపోతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. వైరస్ భారీన పడుతున్న ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావుకు కరోనా భారీన పడ్డారు. కరోనా పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన వెంటనే నిమ్స్ కి వెళ్లి వైద్యులను సంప్రదించారు. వారి సలహా మేరకు హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇటీవలే రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా నిర్దారణ అయింది. ఢిల్లీ పర్యటన నుంచి రాగానే ఎర్రబెల్లికి అస్వస్థతకు గురయ్యారు. కరోనా పరీక్షలు చేయించగా పాజిటివ్ వచ్చింది.
వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో పోరాడేందుకు రాష్ట్ర మంత్రుల బృందం ఇటీవల ఢిల్లీకి వెళ్లింది. దాదాపు వారం రోజుల పాటు అక్కడే ఉండి కేంద్రమంత్రులను కలిశారు. మంత్రులతో పాటు ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావులు కేంద్ర మంత్రులను కలిశారు. ఆ బృందంలోనే ఒక్కొక్కరుగా ఇప్పుడు కరోనా భారీన పడుతున్నారు. ఎర్రబెల్లితో పాటు కేశవరావుకు కరోనా సోకడంతో ఇటీవల ఢిల్లీకి వెళ్లిన మంత్రులు, టీఆర్ఎస్ నేతలు టెన్షన్ పడుతున్నారు.


