ఎంపి హర్షపై కాంగ్రెస్ కార్యకర్తల ఆగ్రహం
Published on: Thu Mar 29, 2012 10:03AM
అమలాపురం ఎంపి హర్షకుమార్ పై ఆ ప్రాంత కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హర్షకుమార్ ఒంటెద్దు పోకడలతో ఒకవర్గం వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, సీనియర్లను కాదని జూనియర్లకు నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎంపి జర్శకుమార్ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ల మధ్య కూడా చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. రాపాక వర్గీయులు బహిరంగంగానే హర్షకుమార్ ను విమర్శిసున్నారు.
హర్షకుమార్ ఈ ప్రాంతంలో పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆయన ఏకపక్ష నిర్ణయాలు మానుకోక పోతే తమ నియోజకవర్గంలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుంటా మని హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పనిచేసిన పాలవర్తి ధనలక్ష్మికి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని, లక్కవరానికి చెందిన రుద్రరాజు గోపాలకృష్ణరాజుకు టెలికాం సలహా సంఘ సభ్యత్వ పదవిని, పొన్నముండ మాజీ సర్పంచ్ చిత్తూరి ఇందిరను కేంద్ర సెన్సార్ బోర్డు పదవికి సిఫార్సు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయనపై విరుచుకుపడుతున్నారు. సకినేటిపల్లి, నర్సాపురం ఒంతెన నిర్మాణానికి కూడా ఎంపి హర్షకుమార్ రాపాకపై ఉన్న కోపంతో అడ్డుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.


