గల్లా దూకుడుకు చింతా కళ్ళెం
Published on: Thu Mar 29, 2012 9:53AM
చిత్తూరుజిల్లాలో గల్లా అరుణకుమారి దూకుడుకు ఎంపి డాక్టర్ చింతా మోహన్ కళ్ళెం వేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఏకు మేకైన గల్లా అరుణకుమారి ఒకవేళ తన కొడుకు గల్లా జయదేవ్ కు తిరుపతి టిక్కెట్ ఇప్పిస్తే జిల్లాలో వారి ఆధిపత్యానికి తిరుగు ఉండదని చింతా మోహన్ కలవరపడుతున్నట్లు తెలిసింది. దీంతో ఆయన గల్లా జయదేవ్ కు టిక్కెట్ రాకుండా చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో భాగంగానే ఆయన గల్లా కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. గల్లా అరుణకుమారి కుటుంబానికి చెందిన అమరరాజా ఫ్యాక్టరీల కోసం అటవీ భూములను ఆక్రమించుకున్నారని, కొండలను తోలిచేసి అక్కడ శాశ్వత కట్టడాలు కట్టారని, పలు గ్రామాలకు రహదారులు లేకుండా చేశారని, చింతా మోహన్ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను ఆయన పార్టీ అధిష్టానానికి కూడా పంపి ఇటువంటి కుటుంబానికి టిక్కెట్ ఇస్తే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా తయారవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జిల్లాలోని రైతాంగం గల్లా కుటుంబానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనల వార్తలు, ఫోటోల క్లిప్పింగులను కూడా ఆయన పార్టీ అధిష్టానానికి పంపినట్లు తెలిసింది. చింతా మోహన్ చర్యలతో గల్లా కొంత కలవరపాటుకు గురయినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.


