రాముడి గుడి విరాళాలతో వాళ్ళు మందు కొడుతున్నారు! కాంగ్రెస్ ఎమ్మెల్యే సెన్సేషనల్ కామెంట్స్
Published on: Tue Feb 2, 2021 4:47PM
అయోధ్యలో రామ మందిర నిర్మాణం మొదలు కావడంతో ఊరూ.. వాడా.. విరాళాల సేకరణ జోరుగా సాగుతోంది. ఈ విరాళాలల సేకరణలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రామాలయ నిర్మాణంలో ప్రజలందరినీ భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతోనే ఈ విరాళాలు సేకరిస్తున్నట్లు వారు చెపుతున్నారు. దీనికోసం ప్రజలు ఎవరికి తోచినంత వారు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఐతే ఈ విరాళాల సేకరణ పై తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. విరాళాల పేరుతో కొంత మంది బీజేపీ నేతలు డబ్బులు దండుకుంటున్నారని ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
తాజాగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ మందిరం విరాళాల పేరుతో బీజేపీ నేతలు కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని.. ఆ డబ్బుతో వారు మద్యం జీవిస్తున్నారని ఝబువా ఎమ్మెల్యే కాంతిలాల్ భురియా ఆరోపించారు. "అయోధ్య రామ మందిర నిర్మాణం పేరిట బీజేపీ నేతలు కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తున్నారు. ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? వీళ్లంతా మందిరం నిర్మాణానికి పగలు సమయంలో డబ్బులు వసూలు చేసి.. ఆ డబ్బుతో రాత్రి పూట మద్యం తాగుతున్నారు.'' అని అయన విమర్శించారు .
మరోపక్క తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య ప్రజల నుండి.. సినీ, రాజకీయ ప్రముఖుల వరకు పెద్ద ఎత్తున అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు అందజేస్తున్నారు. శ్రీరాముని ఆలయ నిర్మాణం కోసం జనవరి 15 నుంచి ఫిబ్రవరి 27 వరకు నిధుల సమీకరణ చేస్తామని ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ నేతలు తెలిపారు.


