TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట ఎంపీ చామల... సంచలన ఆరోపణలు

Published on: Sat Jun 6, 2026 3:05PM

 

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం ప్రత్యేక దర్యాప్తు బృందం  ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో బాధితుడిగా తన వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కిరణ్ కుమార్ రెడ్డి, గతంలో కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో తన ఫోన్ ట్యాప్ చేసినట్లు ఆరోపించారు.

జులై 30 నుంచి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు SIT గుర్తించిందని ఆయన వెల్లడించారు. తన ఐఫోన్‌కు ముందుగానే భద్రతా హెచ్చరిక (అలర్ట్) వచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సంభాషణలను తెలుసుకునే ఉద్దేశంతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు.

అప్పటి ప్రభుత్వంలో సొంత పార్టీ మంత్రుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు పేర్కొన్న ఆయన, మాజీ మంత్రి టీ హరీశ్‌రావు ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురైందని అన్నారు. ఈ వ్యవహారం గురించి అప్పటి బీఆర్ఎస్ నేతలకు తెలుసని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రయోజనాల కోసం అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపించారు. అధికారం కోసం ఏదైనా చేసే విధంగా వ్యవహరించారని విమర్శించారు.

ఈ కేసులో నిందితులకు తగిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును SIT వేగవంతం చేసిన నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులను విచారణకు పిలుస్తోంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఆయన కమ్యూనికేషన్ వివరాలు, కాల్ రికార్డులు, అనుమానాస్పద ట్యాపింగ్ ఘటనలకు సంబంధించిన అంశాలపై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా మరికొందరు కీలక వ్యక్తులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.