యూపీలో ఘోర రైలు ప్రమాదానికి కారణమిదే..?

ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో రైల్వే అధికారులు విశ్లేషిస్తున్నారు. మొదట అతివేగమని..తర్వాత విద్రోహ చర్య ఏమైనా ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే అనధికారిక ట్రాక్ నిర్వహణ పనులే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు. ఈ ప్రాంతంలో ట్రాక్ పనులు జరుగుతున్నట్లు పైలట్‌‌కు తెలియకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో ఉత్తర రైల్వేకి చెందిన సీనియర్ ఇంజనీరింగ్ అధికారులు అక్కడే ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఆ ప్రాంతంలో పనులు నిర్వహిస్తున్న సిబ్బంది ట్రాక్‌పై ఎర్రజెండా కానీ..ఇతరత్రా హెచ్చరిక చర్యలు గానీ తీసుకోలేదని అంటున్నారు. మరోవైపు 10-15 కిలోమీటర్ల వేగంతో వెళ్లాల్సిన రైలు ఏకంగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని అధికారులు చెబుతున్నారు. పూరి నుంచి హరిద్వార్ వెళుతున్న ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ నిన్న సాయంత్రం ఉత్రరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లా ఖతౌలి వద్ద పట్టాలు తప్పడంతో 23 మంది దుర్మరణం పాలవ్వగా..70 మందికి పైగా గాయపడ్డారు.