మహానాడుకు నన్ను పిలవలేదు.. చంద్రబాబును ఎప్పడూ ఏమనలేదు..

 

హైదరాబాదులో ఈరోజు జరిగిన తెలంగాణ టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈకార్యక్రమానికి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు డుమ్మాకొట్టిన సంగతి కూడా తెలిసిందే. ఉన్నదే తెలంగాణ టీడీపీలో కొంతమంది నేతలు. అలాంటిది ఈకార్యక్రమానికి మోత్కుపల్లి రాకపోవడంతో. ఈ అంశం ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో దీనిపై మోత్కుపల్లి స్పందించారు. మహానాడుకు తనకు ఆహ్వానం అందలేదని ఆయన తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తననే దూరం పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి చంద్రబాబు తనకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని...తాను చంద్రబాబును ఉద్దేశించి ఒక్క మాట కూడా అనలేదని.. పార్టీకి నష్టం చేస్తున్నవారి గురించి మాట్లాడుతున్నందుకే తనను దూరం పెడుతున్నారని వాపోయారు. తెలుగుదేశం పార్టీ మొత్తాన్ని కాంగ్రెస్ లో కలపాలన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై చంద్రబాబు ఇంతవరకు స్పందించలేదని చెప్పారు. ఎన్టీఆర్ కు ప్రియ శిష్యుడినైన తనను దూరం పెట్టడం చాలా బాధాకరంగా ఉందని అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తనను పిలిచి మాట్లాడతారని ఆశిస్తున్నానని చెప్పారు. మరి చూద్దాం మోత్కుపల్లి ఆశించినట్టు చంద్రబాబు పిలిచి మాట్లాడతారో..? లేదో..?