గులాబీలో పసుపుని కలపండి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్థంతి వేళ ఆ పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు ఆర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తే బాగుంటుందని అన్నారు.  తెలంగాణ ప్రాంతంలో టీడీపీ రోజు రోజుకి ప్రాభవం కోల్పోతోందని.. అలాంటి మాటలు వింటుంటే మనసుకి బాధనిపిస్తోందని.. పార్టీని భుజాన వేసుకుని నడుపుదామన్నా.. అందుకు సహకరించేవారు లేరని.. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు.. ఓటర్ల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

 

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు మంత్రులు, మెజారిటీ నేతలు అందరూ టీడీపీ నుంచి వెళ్లినవారే. ఇలాంటి పరిస్థితుల్లో టీటీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయగలిగితే బాగుంటుందని నా అభిప్రాయం అంటూ మోత్కుపల్లి వ్యాఖ్యానించడంతో అక్కడున్న కార్యకర్తలు, నేతలు అవాక్కయ్యారు. పార్టీ అంతరించిపోతుందన్న అవమానం కంటే ఒక మిత్రుడికి సాయం చేయడమే గౌరవంగా ఉంటుంది.. ఒకవేళ విలీనం చేసే ఉద్దేశ్యం లేకపోతే అధినేత చంద్రబాబు నాయుడే తెలంగాణలో తిరిగి ఇతర పార్టీలకు ధీటుగా టీడీపీని తీర్చిదిద్దాలని కోరారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మోత్కుపల్లి పార్టీ మారబోతున్నారని కొందరంటే.. కాదు కాదు చంద్రబాబే ఈ ఆయనతో ఇలా మాట్లాడించారు అంటూ రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.