తెలంగాణలో ఖాళీ అయినట్లే ఏపీలో కూడా టీడీపీ ఖాళీ కానుందా?

 

ఆంధ్రప్రదేశ్ లో పసుపుని కాషాయం కమ్మేయబోతుందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో.. బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో బలపడగలమనే నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా ఏపీలో టీడీపీ ప్లేస్ ని భర్తీ చేయాలని బీజేపీ భావిస్తోంది. మొన్న జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు.. కేంద్రంలో బీజేపీని ఓడించాలని కోరుతూ, బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకం చేసే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే ప్రజలు మరొకటి తలిచారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీనే అధికారంలోకి వచ్చింది. ఇక ఏపీలో టీడీపీ ఘోర ఓటమిని చవిచూసింది. అందుకే ఇప్పుడు బీజేపీ.. ఏపీలో టీడీపీని ప్లేస్ ని టార్గెట్ చేస్తోంది. ఏపీలో అధికార పార్టీ వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనుకుంటుంది. దానివల్ల తమని వ్యతిరేకించిన చంద్రబాబుని దెబ్బకొట్టినట్టు ఉంటుంది, అలాగే దక్షణాది రాష్ట్రంలో బలపడినట్టు అవుతుంది. ఇప్పటికే ఈ దిశగా బీజేపీ అడుగులు కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది.

ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ.. వేయబోయే మొదటి అడుగు ఆపరేషన్ కమలం. మొదటగా టీడీపీని దెబ్బతీసేందుకు బీజేపీ పక్కవ్యూహంతో 10మంది టీడీపీ ఎమ్మెల్యేలకు గ్యాలం వేయనుందట. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తమదే కాబట్టి అన్ని విధాలుగా అండగా ఉంటామనే భరోసా కల్పిస్తూ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట. ఇప్పట్లో టీడీపీ కోలుకునే అవకాశం లేదని భావిస్తున్న కొందరు నేతలు సైతం.. తమ భవిష్యత్‌ కోసం బీజేపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి.. ఆ పార్టీతో కలిసి సాగితే, తమ వ్యాపార వ్యవహారాలకు ఇబ్బందులు ఉండవని లెక్కలేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ఆపరేషన్ కమలానికి ఓ టీడీపీ కీలక నేత సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన గుంటూరు జిల్లాకి చెందిన ఓ సీనియర్ నేత. ఆయన మొన్నటివరకు మంత్రిగా కూడా పనిచేసారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య వ్యాపార బంధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ బంధమే ఇప్పుడు ఆపరేషన్ కమలానికి సహకరిస్తోందట. ఆ మాజీ మంత్రి.. బీజేపీ, టీడీపీ నేతల మధ్య రాయబారం నడుపుతూ.. టీడీపీ నేతలను బీజేపీలో చేర్చే ఓ వారధిలా పనిచేస్తున్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కమలం కండువా కప్పుకొనే అవకాశముంది అంటున్నారు. అయితే బీజేపీ కేవలం ఎమ్మెల్యేలనే కాకుండా సీనియర్ నేతలను కూడా టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పరిటాల కుటుంబం, జేసి కుటుంబం, కేశినేని నాని వంటి వారితో సంప్రదింపులు కూడా జరుపుతన్నారట. ఈ సంప్రదింపుల్లో కూడా ఆ టీడీపీ మాజీ మంత్రి కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి టీడీపీ నేతలు.. కొందరు కక్ష సాధింపు చర్యలకు భయపడి, కొందరు రాజకీయ భవిష్యత్తు కోసం, కొందరు వ్యాపారాలు కోసం ఇలా రకరకాల కారణాలతో బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది. మరి ఆపరేషన్ కమలం ఫలించి వారంతా బీజేపీలో చేరితే.. ఏపీలో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో తుదిశ్వాస విడవడానికి దగ్గరగా ఉన్న టీడీపీ.. ఇప్పుడు బీజేపీ పుణ్యమా అని ఏపీలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొనే ప్రమాదముంది. చూద్దాం మరి టీడీపీ పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉంటుందో.