గెలిచిన వారిని కాదని ఓడిన వారికి పట్టంకట్టిన జగన్

 

ఏపీ కొత్త కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై కొనసాగిన సస్పెన్స్‌కు తెరపడింది. సీనియారిటీ, గెలుపు-ఓటములు కంటే విధేయతకే పెద్దపీట వేశారు సీఎం జగన్. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిపై అభిమానంతో ఆయన తనయుడు జగన్ కి అండగా నిలిచి నాడు తృణప్రాయంగా మంత్రి పదవిని, శాసన సభ్యత్వాన్ని వదులుకున్న పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ నిబద్ధతకు తగిన ఫలితం దక్కింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్‌.. తన మంత్రివర్గంలో బోస్‌ కు స్థానం కల్పించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బోస్‌ జగన్‌ సూచనతో మండపేట నియోజకవర్గంలో పోటీచేసి ఓటమి చెందారు. విజయం కష్టసాధ్యమని తెలిసినా జగన్‌ ఆదేశాలతో ఆయన పోటీలో నిలిచారు. అయితే ఎన్నికల్లో ఓటమిచెందినా ఆయన నిబద్ధతకు, విశ్వసనీయతకు ప్రాధాన్యమిచ్చిన జగన్.. మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. ఆయన నిజాయతీ నిబద్ధతలే ఆయనకు పదవి తెచ్చిపెట్టాయని అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అదేవిధంగా ఎన్నికల్లో ఓడిపోయిన మరో సీనియర్ నేతకి కూడా జగన్ అవకాశం ఇచ్చారు. ఆయనే మోపిదేవి వెంకటరమణ. గతంలో వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పని చేసిన మోపిదేవి.. రేపల్లె నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీనికితోడు మోపిదేవి ఎమ్మెల్సీ కూడా కాదు. దీంతో ఆయనను జగన్ కేబినెట్‌లోకి తీసుకుంటారని ఎవరూ అనుకోలేదు. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో పూర్తి భిన్నంగా ఆలోచించారు. మోపిదేవిని కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అయితే మోపిదేవిని కేబినెట్‌లోకి తీసుకోవాలనే అంశంలో జగన్ ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. జగన్ ఎదుర్కొంటున్న అక్రమాస్తుల ఆరోపణల కేసులో జైలుకు వెళ్లిన మోపిదేవి.. దాదాపు ఏడాదిన్నర పాటు జైలులో గడిపారు. అనంతరం వైసీపీలో చేరి 2014లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లోనూ ఆయనకు మరోసారి ఓటమి ఎదురైంది. అయితే తనకు అత్యంత విధేయుడిగా ఉన్న మోపిదేవిని గెలుపోటములతో సంబంధం లేకుండా జగన్ కేబినెట్‌లోకి తీసుకున్నారు.