TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎలాంటి విచారణకు అయినా సిద్ధమే..నిరూపిస్తే రాజీనామా

Published on: Wed Feb 8, 2012 1:21PM

హైదరాబాద్:  తాను ఏతప్పూ చేయలేదని ఎలాంటి విచారణకు అయినా సిద్ధమేనని, తనపై వచ్చిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. మద్యం వ్యాపారులు, సిండికేట్లకు తాను అడ్డుగా తయారయ్యాననే ఆరోపణలు చేస్తున్నారని మోపిదేవి పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన రమణ ఎలా ఉంటాడో కూడా తనకు తెలీదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి ఏసీబీపై ఫైర్‌ అయ్యారు. ఎసిబి తన వివరణ తీసుకోకుండా తన పేరును రిమాండ్ రికార్డుల్లో చేర్చడాన్ని ఆయన తప్పు పట్టారు. ఓ క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి చెప్పిన వాంగ్మూలాన్ని తీసుకొని ఎసిబి తన పేరు చేర్చడం సరికాదన్నారు. రమణపై పలు కేసులు ఉన్నాయన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని, తాను సీఎంను కోరినట్టు మంత్రి మీడియాకు వివరించారు. ఆరోపణలు నిజమని తేలితే మంత్రిగా తాను తప్పుకుంటానని ఆయన తెలిపారు. నాలుగురోజుల్లో అన్ని విషయాలు బయటికి వస్తాయని మంత్రి అనడం విశేషం. ఎక్సైజ్ శాఖ గాడి తప్పిందని తాను ఎప్పుడో చెప్పానని, దానిని సవరించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నారు. మద్యంను ఎమ్మార్పీ ధరకు అమ్మాలని తాను ఆదేశించినందు వల్లే కొందరు తనపై కోపంతో ఉన్నారన్నారు. విచారణ అనంతరం నా ప్రతిష్టకు భంగం కలిగించిన అందరిపై చర్యలు తీసుకుంటానని అన్నారు. తాను గౌరవ ప్రదమైన కుటుంబంలో పుట్టానని చెప్పారు. తాను నైతిక విలువకు ప్రాధాన్యమిచ్చే వ్యక్తినని, రూపాయికి విలువనిచ్చే వ్యక్తి కాదని మంత్రి తెలిపారు.