ఖైదీలకు తీర్దయాత్రా బెయిల్ సౌకర్యం?
Published on: Thu Dec 13, 2012 6:34PM
.jpg)
సత్యం రామలింగరాజుగారు ఏ ముహుర్తాన్నచంచల్ గూడా జైల్లోకి అడుగు పెట్టారో గానీ అయన తన రాకతో జైలుకి మంచి బోణీ చేసారని చెప్పవచ్చును. అంట వరకు ఏ గుర్తింపుకూ నోచుకోని చంచల్ గూడా జైలు, నాటినుండి పెద్ద రాజకీయ కార్యాలయంగా మారిపోయింది. ఇవాళ్ళ రేపు, సి.బి.ఐ. పుణ్యామాని అక్కడకి చేరుకొంటున్నరాజకీయనేతలకి కొదవలేదు. వారిని పరామర్శించేందుకు వచ్చే పెద్దలకు అంతూలేదు. ‘మా చంచలగూడ జైలుకి ఇంత రాజయోగం పట్టిందని’ జైలు సిబ్బంది సంతోషంతో ఉప్పొంగి పోతున్నారంటే ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ఇక, ప్రస్తుతం రాజకీయఅడ్డాగా మారిన చంచల్ గూడ జైలులో విశ్రమిస్తున్నఅనేకమంది హేమా హేమీలతో జైలుగోడల మద్య తమ అనుభావాలు పంచుకొనే భాగ్యం పొందిన మాజీ మంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు, అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. తానూ గత 18 సం.లుగా అయ్యప్పదీక్ష చేస్తున్నందున మళ్ళీ ఈ యేడు కూడా అయ్యప్ప మాల వేసుకోవడం జరిగిందని అందువల్ల కోర్టు వారు తనకి ఈ నెల 24 నుండి వచ్చే నెల 2వ తేది వరకు మధ్యంతర బెయిలు మంజూరు చేయవలసిందిగా అయన కోర్టుకు విజ్ఞప్తి చేసారు. యధావిదిగా ‘సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ’ సి.బి.ఐ. అభ్యంతరం తెల్పింది. కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ను ఈ నెల ౧౮కి వాయిదా వేసింది.
ఇదంతా, నిత్యం చూస్తున్న తంతే గనుక ఇందులో ఎవరికీ ఆసక్తి ఉండకపోవచ్చు. గానీ, ఇలా మతపరమయిన కారణాలు చూపించి జైలులో ఉన్న ఖైదీలు బెయిలు అడిగినప్పుడు అందుకు కోర్టులు అంగీకరిస్తే అదోక కొత్త సాంప్రదాయం సృష్టించినట్లు అవుతుంది కదా? రేపు మిగిలిన ఖైదీలు కూడా వివిధ మాలలు వేసుకొని కోర్టువారిని బెయిలు కోరితే అప్పుడు పరిస్తితి ఏమిటి? అప్పుడు రాజకీయ ఖైదీలుగా ఉన్నపెద్దలకి ఒక న్యాయం సాధారణ ఖైదీలకు మరొక న్యాయం కోర్టులు అమలు చేయలేవు కదా? ఇప్పడు హిందూ మతస్తులయిన ఖైదీలు మాలలు వేసుకొని బెయిలు పొందే అవకాశం పొందగలిగితే, రేపు ఇతర మతస్తులయిన ఖైదీలు కూడా మత పరమయిన సంప్రదాయాలు పాటించేందుకు ఏ మక్కాకో లేక జేరుసలెంకో వెళ్ళడానికి బెయిలు కోరితే అప్పడు పరిస్తితి ఏమిటి? అసలు ఖైదీలుగా ఉన్నవారిని మతపరమయిన కారణాలతో బెయిలు మంజూరు చేయవచ్చా లేదా? అందుకు రాజ్యంగా ఏమి చెపుతుంది? ఈ ప్రశ్నలకి సి.బి.ఐ. కోర్టు ఈ నెల 18న తన నిర్ణయం తో తెలియజేయవచ్చునని ఆశిద్దాము.


