TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎన్నికల నిబంధనలకు పాతర ... డబ్బు, మద్యం పంపిణీలో పోటీ ...

Published on: Sat May 19, 2012 11:08AM

 ఉప ఎన్నికల్లో డబ్బు, మద్యం విచ్చలవిడిగా పంపకం జరుగుతోంది. పేదల అలవాట్లను ఆసరాగా చేసుకుని విజయం సాధించాలన్న అభ్యర్థుల తృష్ణకు ఈ పంపకం అద్దం పడుతోంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో చెక్ పోస్టుల ద్వారా నాలుగుకోట్ల పైచిలుకే లెక్కల్లో చూపని డబ్బు పోలీసుల చేతికి చిక్కిందని తేలుతోంది. దీన్ని ఆదాయపుపన్నుశాఖకు అప్పగించేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. ఆదాయపన్నుశాఖ కూడా నిందితులకన్నా ఆధారాల సేకరణకే విలువ ఇచ్చింది. పోలీసులూ అదే పంథాను అనుసరించారు.

 

 

అసలు ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటర్లను ప్రలోభపెట్ట కూడదు. కానీ, ప్రధాన పార్టీ అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తూనే ఉన్నారు. పార్టీల అధినేతలూ ఇదే తీరులో వ్యవహరిస్తారని వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ నిరూపించారు. ఈయన రోడ్డుషోతో పాటు మద్యం పంపిణీ కూడా సాగిపోయింది. పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడదామని ఆయన కన్నుగప్పే ప్రయత్నమూ చేశారు. రాజంపేటలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలమైంది. మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ కూడా ఇదే రోడ్డుషోలో పాల్గొన్నారు.

 

 

ఈ రోడ్డుషో సందర్భంగా మద్యం సీసాలతో ఉన్న ట్రాక్టరు కొత్తపల్లె పాఠశాల సమీపానికి రాగానే మన్నూరు ఎస్.ఐ. ఆ ట్రాక్టర్ లోని బాటిల్స్ తో పట్టుకున్నారు. ట్రాక్టరును సరుకును ఎస్.ఐ.సీజ్ చేశారు. ఉపురపల్లెకు చెందిన వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ నేత డి.గోపాలరెడ్డి కూడా పోలీసులకు సాక్షిగా దొరికి పోయారు. పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఈ తరహా ప్రలోభాలు ఇక్కడ మామూలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 

 

ఇప్పటి దాకా ఎన్నికల నిబంధనలో ఓటరుకు డబ్బు ఇచ్చినా, మద్యం ఇచ్చినా పార్టీదే తప్పు. కానీ ఇప్పుడు ఓటరు కూడా తప్పు చేసినట్లు ఎన్నికల కమీషన్ గుర్తిస్తోంది. దీంతో ఓటరు అసలు ఆరోపించటానికే ఇక ముందుకు రాలేని పరిస్థితి. ఎందుకంటే ఒప్పుకుని జైలుకు వెళ్ళటం కన్నా సర్దుకుపోవటమే మిన్న అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం వంటి తూర్పు గోదావరి జిల్లాల్లోనూ మద్యం, డబ్బు ఎన్నికను శాసిస్తుంది. అధికార కాంగ్రెస్ పార్టీ అటు ప్రచారంలోనూ, ఇటు అన్నిస్థానాల్లోనే కాదు ఎన్నికల నిబంధనలను అతిక్రమించటంలోనూ ముందుంది. గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి లక్ష్మారెడ్డిపై నిబంధనావళి అతిక్రమణ కేసు నమోదు అయింది. ఆయన ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఊరేగింపు కోసం పోలీసు అనుమతి కోరాల్సి ఉన్నా నిర్లక్ష్యం చేశారు. ప్రత్యేకించి పోలీసుల ముందునుంచే ఈ ఊరేగింపు కూడా చేయటంతో ఈయనపై కేసు ఆధారాలతో సహా నమోదైంది.