టీడీపీనా, వైసీపీనా డైలమాలో పెదరాయుడు
Published on: Thu Apr 7, 2016 11:57AM

సినీనటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు తాను రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తానంటున్నారు. త్వరలోనే తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ప్రకటించారు. తనకి ప్రత్యేకంగా వేరే పార్టీ పెట్టే ఉద్దేశం లేదని చెబుతూనే చంద్రబాబు, కేసీఆర్, జగన్ అంతా తనకు సన్నిహితులేనంటూ వారిపై ప్రశంసల వర్షం కురిపించారు గాని ఏ పార్టీలో చేరతానో మాత్రం చెప్పలేదు. కలెక్షన్ కింగ్ పొలిటికల్ ఎంట్రీ తెలుగుదేశంతోనే జరిగింది. అన్న ఎన్టీఆర్ హయాంలో టీడీపీ తరపున ప్రచారం చేసిన మోహన్ బాబు , చంద్రబాబు హయాంలో ఎంపీగా రాజ్యసభకు ఎన్నికకాబడ్డారు. 2004లో టీడీపీ ఓటమితో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో చంద్రబాబుతో ఒకింత దూరం పాటించారు. ఇదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమార్తెతో తన పెద్ద కుమారుడు విష్ణుకు వివాహం జరిపించి వైఎస్ కుటుంబానికి దగ్గరయ్యారు. వైఎస్ మరణం తర్వాత జగన్‌తోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
మరో ప్రక్క రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్‌పై మాటల యుద్ధం చేసిన మోహన్ బాబు , కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో సైలెంటయ్యారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుతున్నారని ఆయన్ను పొగుడుతున్నారు. తన చిన్న కుమారుడు మనోజ్ పెళ్లి వేడుకకు గులాబీ దళపతిని ఆహ్వానించి పాత గొడవలు మరచిపోయినట్టు సంకేతాలు పంపారు. తనకు రాజకీయ భిక్షను పెట్టి, పర్సనల్‌గా ఎంతో సపోర్ట్ చేసిన తెలుగుదేశం వైపే పెదరాయుడు మొగ్గుచూపుతారని రాజకీయ పండితులు భావిస్తున్నారు. అలా అని జగన్‌ను దూరం చేసుకోకుండా తన కుటుంబంలో వేరోకరిని వైసీపీలో చేర్చేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నట్టు టాక్. ఈ విధంగా అటు బాబుని, ఇటు జగన్‌ని సంతృప్తి పరచాలని చూస్తున్నారట ఈ రామన్న చౌదరి.


