అమరావతి 2.0 ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ!
Published on: Wed Mar 12, 2025 12:16PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి 2015లో భారీ స్థాయిలో శంకుస్థాపన జరిగిన సంగతి తెలిసిందే. ఆ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజయర్యారు. ఆ సందర్భంగా అమరావతి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమర్థవంతమైన చంద్రబాబు నాయకత్వంలో అమరావతి దేశానికే ఆదర్శవంతమైన నగరంగా, ఢిల్లీని మించిన రాజథానిగా రూపు దాలుస్తుందని ఆకాంక్షించారు. అయితే ఆ తరువాత పరిస్థితులు తారుమారైపోయాయి. 2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టారు. అక్కడ నుంచి ఐదేళ్ల పాటు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిరంతర దాడులు, అణచివేతను ఎదుర్కొంది. రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది. రాజధానికి భూములిచ్చిన రైతులను జగన్ సర్కార్ నానా రకాలుగా వేధించింది. అక్రమ కేసులు బనాయించింది. అర్ధరాత్రి పోరాట శిబిరాలపై, రైతుల నివాసాలపై దాడులు చేయించింది.
జగన్ ఐదేళ్ల అరాజకపాలనకు ఆంధ్రా జనం 2024 ఎన్నికలలో చరమగీతం పాడారు. ఓటుతో జగన్, ఆయన పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా అర్హత కూడా లేదని విస్పష్ట తీర్పు ఇచ్చారు. 2024 ఎన్నికలలో నభూతో నభవిష్యత్ అన్నరీతిలో అమోఘ విజయం సాధించిన తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. అమరావతికి మళ్లీ పునర్వైభవం తీసుకువచ్చి నిర్దుష్ట కాల వ్యవధిలో పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే త్వరలో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.
ఈ పునర్నిర్మాణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్నారని విశ్వసనీయంగా తెలిసింది. పదేళ్ల కిందట అంటే 2015లో అమరావతి శంకుస్థాపనకు హాజరైన మోడీ.. ఇప్పుడు దశాబ్దం తరువాత అదే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి హాజరు కానుండటం విశేషం.


