జీ7 వేదికగా మోదీ సంచలనం.. : భారత నావికుల మృతిపై ట్రంప్ ను నిలదీసిన భారత ప్రధాని!
Published on: Wed Jun 17, 2026 9:37AM

అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్ తన గళాన్ని మరోసారి గట్టిగా వినిపించింది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న జీ7 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో అమెరికా సైన్యం జరిపిన సైనిక దాడుల్లో అమాయకులైన భారత నావికులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. ఏకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనే, జీ7 అవుట్‌రీచ్ సెషన్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికా చర్యలను మోదీ నిలదీయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. సముద్ర వాణిజ్య మార్గాలను సురక్షితంగా ఉంచడం, అంతర్జాతీయ జలాల్లో ప్రయాణించే నావికుల ప్రాణాలకు భద్రతను నిర్ధారించడం కేవలం ఒక్క దేశానికే పరిమితం కాదని, అది ప్రపంచ దేశాల ఉమ్మడి, సమష్టి బాధ్యత అని ఆయన ప్రపంచ దేశాధినేతల సమక్షంలో గట్టిగా చెప్పారు.
పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాలను తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని చెబుతూనే.. అక్కడ జరుగుతున్న దాడుల వెనుక ఉన్న చేదు నిజాలను మోదీ ప్రపంచ దేశాలకు కళ్లకు కట్టారు ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, సైనిక సంఘర్షణల వల్ల మిత్ర దేశాలలో తీవ్రమైన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తోందన్న ప్రధాని మోడీ.. ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి గుండా జరిగే సముద్ర రవాణాకు అంతరాయం కలగడం వల్ల, మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థే అతలాకుతలం అవుతోందని హెచ్చరించారు. వివిధ దేశాలను వాణిజ్యపరంగా, ఆర్థికంగా అనుసంధానించే నావికుల భద్రతను కాపాడాల్సిన బాధ్యత సూపర్ పవర్ దేశాలపై కూడా ఉందని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.
ఇరాన్‌కు సంబంధించిన ఓడరేవులపై అమెరికా విధించిన కఠినమైన దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తున్నాయనే అనుమానంతో, ఇటీవల కొన్ని అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై యూఎస్ సైన్యం వరుసగా దాడులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
అమెరికా సైన్యం దాడులపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ఉన్నతాధికారిని అత్యవసరంగా పిలిపించి, ఈ దాడులపై భారత్ తరఫున తీవ్ర ఆందోళనను, ఆగ్రహాన్ని తెలియజేసింది. ఇప్పుడు ప్రధాని మోడీ ప్రపంచ వేదికపై అమెరికా తీరును ఎండగట్టారు.


