ఏపీకి కేంద్రం డబుల్ షాక్.. జగన్ రెడ్డికి ఇక చుక్కలేనా..?
Published on: Tue Jul 6, 2021 10:13AM
మూడు నిర్ణయాలు.. ఆరు కేసులు.. పన్నెండు ఎదురుదెబ్బలు. గత రెండేండ్లుగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వ పాలన ఇలానే సాగుతోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న అస్తవ్యస్థ, అనాలోచిత నిర్ణయాలతో పాలన కుంటుపడిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను న్యాయస్థానాలు రద్దు చేశాయి. జగన్ రెడ్డి సర్కార్ కు చాలా సార్లు మొట్టికాయలు పడ్డాయి. కోర్టులే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి షాకులు ఇస్తూనే ఉంది. ఏపీకి ప్రయోజనం కలిగే నిర్ణయాలేవి తీసుకుపోగా.. పాత వాటికి మంగళం పాడుతోంది. గతంలో ప్రకటించిన పథకాలను వెనక్కి తీసుకుంటోంది. తాజాగా ఒకేరోజు ఏపీకి డబుల్ షాకిచ్చింది కేంద్రం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గినట్లు కనిపించిన మోడీ సర్కార్.. మళ్లీ స్పీడ్ పెంచింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందడుగు వేస్తోంది. రైల్వే జోన్ కూడా వాల్తేర్ బేస్ గా ఉండబోదని సంకేతాలిచ్చింది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా మార్చాలని చూస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ రెండు నిర్ణయాలు పెద్ద షాకే.
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కల రైల్వే జోన్. అధిక ఆదాయం.. ప్రజా రవాణా, ముడిసరుకు రవాణాలోనూ ఏ మాత్రం తీసిపోదు. పెద్ద పెద్ద నగరాలకి ధీటుగా వాల్తేర్ రైల్వే ఆదాయం ఉంటోంది. ఇక్కడ ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుకు ఉత్తరాంధ్రులు రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ వస్తే.. తమ కష్టాలు తీరిపోతాయని ఉత్తరాంధ్రుల ఆలోచన. 2014లో జరిగిన ఏపీ విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇది విశాఖ కేంద్రంగానే ఇస్తారని అంతా భావించారు. కానీ కేంద్రం మాత్రం దీనికి సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. ఒడిశాలో రాయగడ డివిజన్ ఏర్పాటుకు వేగంగా పనులు పూర్తి చేస్తోందని సమాచారం. ఏపీ కోరుకున్న విధంగా వాల్తేరు డివిజన్ కు కాకుండా రాయగడ డివిజన్ కేంద్రంగా ఈ రైల్వే జోన్ ఏర్పాటు కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్పటివరకూ అధికారిక ప్రకటనేదీ రాకపోయినా రాయగడ డివిజన్ ఏర్పాటుపై జరుగుతున్న ప్రయత్నాలు చూస్తుంటే వాల్తేరుకు బదులుగా రాయగడ కేంద్రంగా ఇది ఏర్పాటు కావడం ఖాయంగా తెలుస్తోంది.
రైల్వే జోన్ వల్ల ఉపయోగాలు అనేకం. కొత్త ఉద్యోగాలు.. ఇక్కడి ఆదాయం ఇక్కడే కొంత వినియోగించుకునే వెసులుబాటు.. ఇక్కడి వారికి ప్రాధాన్యత.. వంటి అనేకాంశాలు ఇక్కడ కీలకంగా చెబుతున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ లో కొంత భాగాన్ని, దక్షిణ మధ్య రైల్వేలో కొంత భాగాన్ని తీసుకుని దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కోసం కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. అయితే దీని వల్ల ఏపీకి ఏ మేరకు న్యాయం జరుగుతుందనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. విభజన హామీల్లో ఏపీకి ఇదొక ఉపశమనంగా అంతా అనుకున్నారు. కానీ.. కేంద్రం ఒడిశా రాష్ట్రానికే ఈ జోన్ తరలిస్తే.. ఇక ఏపీకి ఏం న్యాయం జరుగుతుందని ఇక్కడి వారి ప్రశ్న. కొత్త రైల్వే జోన్ ఏర్పాటైనా ఆదాయం తిరిగి రాయగడ డివిజన్ కే వెళ్లిపోతుంది.
ఇక విశాఖ స్టీల్ అంశంలో కార్మిక సంఘాలు, ప్రజల మనోభావాలను కేంద్రం పూర్తిగా పక్కనబెట్టేసింది. స్లీట్ ప్లాంట్ కార్మికులు, విసాఖ ప్రజలు, పార్టీలు చేస్తున్న పోరాటాన్ని పట్టించుకోకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంశం పై పరిశీలనకి ఇద్దరు అడ్వైజర్లను నియమిస్తున్నట్లు కేంద్రం సోమవారం ప్రకటించింది. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంత చేసి.. ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు సలహాదారుల్ని నియమించడంతో ఏపీకి షాక్ తప్పలేదు. కేంద్రం ఎంత పక్కాగా ఉందంటే.. ఈ ఇద్దరు సలహాదారుల్లో ఒకరు లావాదేవీల సలహాదారు.. మరొకరు న్యాయ సలహాదారుగా ఉన్నారు. అంటే అన్ని విధాలా ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా కేంద్రం తనపని తాను చేస్తోందన్నమాట.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ముందుకు వెళ్లడం, వాల్తేర్ డివిజన్ లేదనే సంకేతం ఇవ్వడంతో ఉత్తరాంధ్ర జనాలు మండిపోతున్నారు. విపక్షాలు కూడా ఈ అంశాలపై మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. జగన్ రెడ్డి సర్కార్ చేతకానితనం వల్లే ఏపీకి అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తున్నాయి. తన కేసుల కోసం జగన్.. కేంద్రానికి సరెండర్ అయ్యారని, ఏపీకి తీరని నష్టం కల్గిస్తున్నారని విపక్ష నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో స్టీల్ ప్లాంట్ పై కేంద్రమంత్రులతో జగన్ మాట్లాడారని చెప్పిందంటా అసత్యమేనని తేలిందని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.


