మోడీ ప్రభుత్వం కాపీ కొట్టేస్తోందిట

 

ఇటీవల దేశవ్యాప్తంగా చాలా అట్టహాసంగా ప్రారంభించబడిన ‘ప్రధానమంత్రి జన ధన యోజన’ పధకంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. దేశ ప్రజలకు ఎన్నో గొప్ప గొప్ప కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఏమిచేయలేక యూపీయే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలను ఒకటొకటిగా కాపీ కొడుతూ వాటికి పేర్లు మార్చి తమ పధకాలుగా గొప్పలు చెప్పుకొంటోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిష్క్ సింఘ్వీ ఎద్దేవా చేసారు. తాము 2004లో అధికారం చేప్పట్టిన తరువాత దేశంలో 43.9 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేయగా, తాము 2014లో అధికారం నుండి దిగిపోయే సమయానికి అవి 77.32 కోట్లు ఉన్నాయని తెలిపారు. తమ ప్రభుత్వం కృషి వలన చివరి మూడు సం.లలో 67,000 నుండి ఒకేసారి 2.48 లక్షల ఖాతాలు పెరిగాయని గణాంకాలతో సహా వివరించారు. తాము ఇంతగా కృషి చేసి దేశ ప్రజలందరికీ బ్యాంక్ ఖాతాలు ఏర్పాటు చేస్తే, మోడీ ప్రభుత్వం కనీసం ఆ విషయం ఎక్కడా ప్రస్తావించకుండా, ఇప్పుడే కొత్తగా ప్రవేశపెడుతున్నట్లుగా చాలా ఆర్భాటంగా ‘ప్రధానమంత్రి జన ధన యోజన’ పధకం ప్రవేశపెట్టడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఇది చూస్తే మోడీ ప్రభుత్వం అప్పుడే చేతులేట్టేసినట్లే ఉందని ఆయన ఎద్దేవా చేసారు.

 

అయితే ప్రజలకు అర్ధం కాని విషయం ఏమిటంటే, కేవలం బ్యాంకు ఖాతాలు తెరిపించినంత మాత్రాన్న ఏమయినా ఒరుగుతుందా? అదే నిజమయితే ఇప్పటికే బ్యాంకు ఖాతాలున్న77.32 కోట్ల మంది ప్రజలు తమ సమస్యలు, బీదరికం నుండి బయటపడిపోయినట్లేననుకోవలసి ఉంటుంది. కనుక దేశంలో మిగిలిన వారి చేత కూడా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తునందుకు మోడీ ప్రభుత్వాన్ని మెచ్చుకోకపోగా తమ పధకాన్ని కాపీ కొట్టేస్తున్నారని విమర్శించడం ఎందుకు? కాంగ్రెస్, బీజేపీలు రెండూ కూడా ఇదేదో సర్వ రోగ నివారిణిగా భావిస్తున్నట్లున్నాయి.