ఆ 40 శాతమే మోడీ- చంద్రబాబుల మధ్య దూరం పెంచిందా..?

 

దేశంలోనే సీనియర్ రాజకీయ వేత్తగా.. నాలుగు దశాబ్ధాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూసి.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడుకు తన కంటే ఎంతో జూనియర్ అయిన ప్రధాని మోడీ దగ్గర పదే పదే అవమానం జరుగుతూనే ఉందన్నది సగటు తెలుగుదేశం కార్యకర్త అభిప్రాయం. సినీనటుడు మోహన్‌బాబు కుటుంబానికి అపాయింట్‌మెంట్ ఇచ్చిన మోడీ.. ముఖ్యమంత్రి హోదాలోని వ్యక్తితో మాట్లాడటానికి రెండేళ్లుగా ఎందుకు ససేమీరా అన్నాడు. ఆంధ్రుల జీవనాడిగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న పోలవరానికి ప్రధాని ఎందుకు అడ్డుపడుతున్నారు అన్నది జనానికి అంతు చిక్కని ప్రశ్నలుగా మారాయి. అయితే ఇందుకు సవాలక్ష కారణాలు చెబుతున్నారు విశ్లేషకులు.

 

2014లో చంద్రబాబు నాయుడు అధికారాన్ని చేపట్టిన నాటి నుంచి నేటి వరకు ప్రజలు ఏమనుకుంటున్నారు.. జగన్ ప్రతిపక్షనేతగా ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాడా.. బీజేపీ పరిస్థితి మెరుగయ్యిందా..? మరింత దిగజారిపోయిందా..? తదితర విషయాల మీద ప్రధాని నరేంద్రమోడీ ఇంటెలిజెన్స్ ద్వారా సర్వే చేయించారట. ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లిన ఇంటెలిజెన్స్ తను సేకరించిన సమాచారాన్ని కాసి వడపోసి తుది నివేదికను ప్రధాని మోడీకి అందజేసిందట. ఈ సర్వేలో అధికార తెలుగుదేశం పార్టీ గత ఎన్నికలతో పోలిస్తే 20 శాతం ఓట్లను కోల్పోతోందని తేలింది. ఇచ్చిన హామీల్లో కొన్ని నిలబెట్టుకుంటున్నప్పటికీ.. స్థానిక నేతలు, ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడటం అధికారపక్షం పట్ల ప్రజల్లో కాస్త వ్యతిరేకతను తీసుకొచ్చిందట. అదే ఓట్లపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని అంచనా వేశారు.

 

మరి టీడీపీ వీక్ అయ్యిందంటే.. ప్రధాన ప్రతిపక్షం వైపు జనాలు మొగ్గు చూపాలి కదా.? కానీ అలా జరగలేదు.. వైఎస్సార్ కాంగ్రెస్ 2014 ఎన్నికలలో పొందిన ఓట్లశాతంలో 19 శాతానికి పైగా పొగొట్టుకుంటుందని సర్వే నిగ్గు తేల్చింది సర్వే. ప్రతిపక్షనేతగా ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడ్డారట. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా అడ్డుకోవడంలో వైసీపీ అధినేత సమర్థవంతంగా పని చేయలేదని తేలిందట. దానికి తోడు ఆయనపై ఎప్పటి నుంచో వేలాడుతున్న అవినీతి కేసుల కత్తి ప్రజలను ఆలోచింపచేస్తోందట. మరి టీడీపీ కోల్పోయే 20 శాతం, వైసీపీ పొగొట్టుకునే 19 శాతం ఏమవుతుంది.. ఎటు పోతుంది.?

 

పడితే టీడీపీకి పడాలి లేకపోతే వైసీపీకి పడాలి.. ఈ రెండు కాకుండా ఏపీలో వేరే రాజకీయ పార్టీ లేదు. ఇప్పుడు ఈ రాజకీయ శూన్యతను సొమ్ము చేసుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ ఇస్తే బీజేపీతో పొత్తుకు సిద్ధమేనని జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు. ఈ ప్రపోజల్‌ను పరిగణనలోనికి తీసుకోవడంతో పాటు మరో సేఫ్ గేమ్ మొదలుపెట్టింది కమలం. కేంద్రం నిధుల ద్వారా జరిగే అభివృద్ధి తాలుకూ క్రెడిట్‌ను చంద్రబాబు ఖాతాలో పడకుండా అడ్డుకుని దానిని మోడీ అకౌంట్‌కి మళ్లించాలన్నది కాషాయం స్కెచ్. టీడీపీ-వైసీపీలు కోల్పోయే 40 శాతం ఓట్లకు తోడు.. జగన్‌ని కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది బీజేపీ ప్లాన్.. ఒకవేళ అప్పుడు జగన్ ఎదురు తిరగాలని చూస్తే.. ఏం మంత్రం వేయాలన్నది మోడీ-అమిత్‌షాలకు బాగా తెలుసు అంటున్నారు విశ్లేషకులు.