మోడీ దాచిన పెద్ద రహస్యం..!!

మోడీ ప్రధాని పదవి చేపట్టి నాలుగేళ్లు దాటింది.. ఈ నాలుగేళ్లలో అవకాశం దొరికినప్పుడల్లా మోడీ, కాంగ్రెస్ మీద విమర్శలు చేసారు.. ఇప్పటి పరిస్థితులే కాదు, ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం ఇందిరాగాంధీ సమయంలో ఎమర్జెన్సీను కూడా గుర్తుచేస్తూ విమర్శలు చేస్తారు.. అలాంటి మోడీ దేశానికీ నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ చేసిన పెద్ద తప్పుని నాలుగేళ్లుగా రహస్యంగా ఉంచారట.. కాంగ్రెస్ తప్పు చేస్తే మోడీ విమర్శించకుండా నాలుగేళ్లు ఉన్నారా? నో వే అంటారా.. నిజమండి బాబూ.. ఈ విషయాన్ని స్వయంగా మోడీనే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'ఆర్థిక నిపుణుడైన వ్యక్తి ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుందని భావిస్తాం..కానీ తాను ప్రధాని కుర్చీలో కూర్చునే సమయానికి దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని' మోడీ, అప్పటి మన్మోహన్ ప్రభుత్వం మీద విమర్శలు చేసారు.. ఆర్థిక వేత్త అయిన ప్రధాని, ఆర్థిక నైపుణ్యం ఉన్న ఆర్థిక మంత్రి హయాంలో దేశం సంక్షోభంలో పడింది.. ఆ గణాంకాల్ని చూసి తాము నిర్ఘాంతపోయామని మోడీ అన్నారు.. ఎవరూ ఊహించని రీతిలో ఉన్న అంకెల్ని చూసి, వాటిని సరి చేసేందుకు ప్రయత్నించామన్నారు.

తాము అధికారంలోకి వచ్చినప్పుడు దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది..ఆ  సమయంలో తమ ముందు రెండు మార్గాలున్నాయి.. ఒకటి ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చెప్పటం.. రెండోది దెబ్బ తిన్న భారత ఆర్థిక పరిస్థితిని గుట్టుగా బాగుచేయటం.. మొదటి విధానంలో రాజకీయ లబ్థికి అవకాశం ఉంది.. రెండో విధానంలో మాత్రం అలాంటిది లేదు.. అయినప్పటికీ తాము రెండో విధానాన్నే ఎంచుకున్నామని మోడీ అన్నారు.. రాజకీయంగా ఎన్ని విమర్శలు వచ్చినా భరించాం.. దేశానికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని మోడీ తెలిపారు.

ఓ వైపు ప్రజల్లో మోడీ మీద వ్యతిరేకత మొదలవ్వడం, మరో వైపు కాంగ్రెస్ విపక్షాలన్నింటినీ ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో మోడీని దెబ్బ తీయాలని చూస్తున్న తరుణంలో.. మోడీ నాలుగేళ్ళ రహస్యం ఇప్పుడు బయటపెట్టడంతో అందరు షాక్ అవుతున్నారు.. మరి మోడీ వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎలా తిప్పికొడుతుందో చూడాలి.. అయితే మోడీ వ్యాఖ్యల పట్ల కొందరి స్పందన వేరేలా ఉంది.. కాంగ్రెస్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని నాలుగేళ్లకు చెప్పారు.. మరి మీరు అధికారంలోకి వచ్చాక నోట్లరద్దు, జీఎస్టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని విమర్శలు వస్తున్నాయి.. ఇక దీనికి సమాధానం ఇంకెన్నాళ్ళకి చెప్తారు అంటూ ఛలోక్తులు వినిపిస్తున్నాయి.