జూన్ 4న ఏపీకి మోడీ.. 7న నడ్డా
Published on: Sun May 29, 2022 10:24AM
బీజేపీ ఏపీపై దృష్టి సారించిందా.. అన్న ప్రశ్నకు వరుసగా ఆ పార్టీ అగ్రనేతలు రాష్ట్ర పర్యటనకు రానుండటంతో పరిశీలకులు ఔననే అంటున్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ జూన్ 4న ఏపీ రానున్నారు. భీమవరంలో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొంటారు. అదే నెల 7న రాజమండ్రిలో బీజేపీ ఆధ్వరంలో జరిగే భారీ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అద్యక్షుడు నడ్డా హాజరు కానున్నారు.
వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనల మధ్య పొత్తుపై రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతున్న తరుణంలో మోడీ, నడ్డాలు రాష్ట్ర పర్యటనకు రానుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే బీజేపీ, జన సేన పార్టీల మధ్య పొత్తు ఉన్న నేపథ్యంలో జనసేన తెలుగుదేశంతో జట్టు కడితే బీజేపీ ఏం నిర్ణయం తీసుకోవాలన్నదానిపై పార్టీ నేతలకు మోడీ దిశా నిర్దేశం చేసే అవకాం ఉంది. అలాగే 7న రాజమహేంద్ర వరంలో జరిగే బహిరంగ సభలో పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో రాష్ట్రంలో బీజేపీ వచ్చే ఎన్నికలకు సమాయత్తమయ్యే దిశగా నడ్డా పార్టీ శ్రేణులకు పిలుపు మార్గ నిర్దేశనం చేస్తారని భావిస్తున్నారు. ఇ
ప్పటికే ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థి పోటీలో ఉంటారని ప్రకటించడం ద్వారా బీజేపీ రాష్ట్ర రాజకీయాలలో తెలుగుదేశం పార్టీతో మైత్రికి అవకాశం లేదన్న సందేశం ఇచ్చింది. దీనిపై పవన్ కల్యాణ్ ఇంకా స్పందించలేదు. అయితే పొత్తుల విషయంలో నిర్ణయం తీసుకోవలసింది రాష్ట్ర నాయకత్వం కాదనీ, బీజేపీ అధిష్టానమేనని ఆయన పార్టీ అంతర్గత సమావేశాల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చస్తానన్న పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో కలిసి పని చేయడంపై బీజేపీ అధిష్ఘానాన్ని ఒప్పించగలనన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించేలా బీజేపీ అధిష్టానాన్ని తాను ఒప్పించాననీ, అదే రీతిలో రాష్ట్రంలో జగన్ ను అధికారానికి దూరం చేయడం కోసం ఓట్లు చీలకుండా బీజేపీని కూడా పొత్తుకు కలిసి వచ్చేలా ఒప్పించగలనని ధీమా వ్యక్తం చేసినట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం, జనసేనల మధ్య ఎన్నికల పొత్తుపై ఇప్పటి వరకూ అధికారిక ప్రకటన వెలువడక పోయినా క్షేత్ర స్థాయిలో జన సేన కార్యకర్తలు తెలుగుదేశంతో కలిసి పని చేస్తున్నారంటే పార్టీ నుంచి వారికి ఆమేరకు స్పష్టమైన సందేశం అంది ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ రాష్ట్ర పర్యటన రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.


