TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోదీనే మొన‌గాడు.. యోగినే యోగ్యుడు.. త‌గ్గేదేలే..

Published on: Thu Mar 10, 2022 10:43AM

యూపీలో బీజేపీ ఎందుకు గెలిచింది? అనే ప్ర‌శ్నే అవ‌స‌రం లేదు. ఎందుకంటే అక్క‌డ బీజేపీ గెలిచి తీరాల్సిందే. మామూలుగా లేదు మ‌రి అక్క‌డి మేట‌ర్‌. వ్య‌వ‌సాయ చ‌ట్టాలు.. రైతుల‌ను కారుతో గుద్ది చంప‌డాలు.. క‌రోనా టైమ్‌లో వ‌ల‌స కూలీలు.. ఇలాంటి నెగెటివ్ ఫ్యాక్ట‌ర్స్ ఏవీ యూపీలో బీజేపీ ప్ర‌భంజ‌నాన్ని అడ్డుకోలేక‌పోయాయి. క‌నీసం.. స్పీడ్ బ్రేక‌ర్‌లా కూడా నిల‌వ‌లేక‌పోయాయి. త్రిబుల్ సెంచ‌రీ దిశ‌గా క‌మ‌లం పార్టీ దూసుకుపోవ‌డం మామూలు విష‌యం కాదు. అదే బీజేపీ స‌త్తా. మోదీ-యోగిల క్రేజ్‌.

బీజేపీకి ఎందుకు ఓటేయాలి? అనే ప్ర‌శ్న వ‌స్తే.. ఓసారి కాశీకి వెళ్లి చూడండి తెలుస్తుంది. పువ్వు గుర్తుకు ఎందుకు ఓటేయాలో. స్వ‌యంగా ప్ర‌ధాని మోదీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసిని అద్భుత న‌గ‌రంగా తీర్చిదిద్దారు మోదీ. కేంద్ర నిధుల‌ను భారీగా కుమ్మ‌రించారు. ఒక‌ప్పుడు.. అప‌రిశుభ్ర‌త‌, చెత్తా, చెదారం, పేడ‌, ఇరుకైన రోడ్ల‌తో అస్త‌వ్య‌స్తంగా ఉండే కాశీ న‌గ‌రాన్ని అతి విశాలంగా, సుంద‌ర సిటీగా మార్చేశారు మోదీ. ఒక‌ప్పుడు ఇది కాశీనా..? ఇంత ఘోరంగా ఉంటుందా? అనుకునే వాళ్లు అక్క‌డికి వెళ్లిన‌వారు. కానీ, అబ్బో కాశీ అంటే ఇంత బాగుంటుందా.. అంటున్నారు ఇప్పుడు అక్క‌డికి వెళ్లిన‌వారు. ద‌టీజ్ మోదీ. 

ఒక్క వార‌ణాసి డెవ‌ల‌ప్‌మెంట్‌ను చూసే.. విశాలమైన యూపీ అంతా బీజేపీకి ఓటేశారా? అంటే అలా కాదు. అతిపెద్ద రాష్ట్ర‌మైన ఉత్త‌ర ప్ర‌దేశ్ వ్యాప్తంగా బీజేపీకి క్రేజ్ పెర‌గ‌డానికి సీఎం యోగి మేనియా కూడా కార‌ణ‌మే. యోగి అధికారం చేప‌ట్టాక‌.. యూపీలో మార్పు చేసి చూపెట్టారు. అది ప్ర‌జ‌లు మెచ్చారు. ఒక‌ప్పుడు క్రైమ్ కేపిట‌ల్‌గా ఉండే యూపీలో.. నేర‌గాళ్ల‌ను, రౌడీషీట‌ర్ల‌ను పిట్ట‌ల‌ను కాల్చిన‌ట్టు కాల్చిపారేశారు. వంద‌లాది ఎన్‌కౌంట‌ర్ల‌తో యూపీలో శాంతిభ‌ద్ర‌త‌లు తీసుకొచ్చారు. పాల‌న‌లోనూ త‌న‌దైన మార్క్ చూపించారు యోగి. అవినీతి, వైట్ కాల‌ర్ విధానాల‌కు చెక్ పెట్టారు. ఆడ‌పిల్ల‌ల చ‌దువు, పెళ్లిళ్ల‌కు ప్ర‌త్యేక ప‌థ‌కాలు అమ‌లు చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతోనైనా.. బీజేపీ హ‌యాంలోనే అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణం జ‌రుగుతుండ‌టం కూడా ఆ పార్టీకి బాగా అడ్వాంటేజ్ అయింది. 

ప్ర‌తిపక్షాల పేల‌వ‌మైన గ‌త పాల‌న ముందు.. ఓ సాధువైన యోగి సుప‌రిపాల‌న‌ను ప్ర‌జ‌లు మెచ్చారు. మ‌రోసారి అధికారం క‌ట్ట‌బెట్టారు. మోదీ-యోగిల మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌ని.. ఈసారి యోగికి మోదీ చెక్ పెడ‌తార‌ని.. విప‌క్షం చేసిన దుష్ప్ర‌చారాన్ని ప్ర‌జ‌లు న‌మ్మ‌లేదు. కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌తో రైతులు బీజేపీపై ఆగ్ర‌హంతో ఉన్నార‌నే వాద‌నలో ప‌స లేద‌ని తేలిపోయింది. బ‌హుషా ఆ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకున్నందుకు.. బీజేపీ ఎంపీ కుమారుడు రైతుల‌ను కారుతో గుద్ది చంపిన అరాచ‌కాన్ని ప్ర‌జ‌లు మ‌న్నించారేమో? 

ఇలా.. యూపీలో యోగి-బీజేపీ గెలుపున‌కు అనేక కార‌ణాలు. మోదీ మేనియాతో పాటు యోగి యోగ్య‌త కూడా క‌మ‌ల వికాసానికి దోహ‌ద‌ప‌డింది. అందుకే, ఇంత‌టి భారీ మెజార్టీతో వ‌చ్చి ప‌డింది. ద‌టీజ్‌ మోదీ.. అదే యోగి.