మోడీ, అమిత్ షా.. షాక్!

 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒక్కసారిగా షాకయ్యారు. మనం ఎన్ని వేషాలేసినా కుక్కిన పేనుల్లా పడి వుంటార్లే... ఎదురు తిరిగే సాహసం కూడా చేయర్లే అని వీళ్ళిద్దరూ ఇంతకాలం అనుకున్నారు. ఇప్పుడు దేశంలో మన హవా నడుస్తోంది... వాళ్ళా మనమీద ఆధారపడి వున్న వాళ్ళు... అంచేత మనల్ని ఎదిరించే సాహసం వాళ్ళు చేయబోరు అని భావించారు. అయితే సీన్ రివర్స్ అయింది.. శాంతానికీ కోపం వచ్చింది... బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. అలా జరగదులే అని నిశ్చింతగా వున్న ఇద్దరు పెద్ద మనుషులూ ఇప్పుడు ఒక్కసారిగా షాకైనట్టు సమాచారం. మరో ఏడాదిపాటు ఇలాగే ఇష్యూని సాగదీసి, ఏపీకి నిధులు రాకపోవడానికి చంద్రబాబు అసమర్థతే కారణం అన్నట్టుగా కలరింగ్ ఇచ్చి, ఆ తర్వాత వైసీపీతో పొత్తు పెట్టుకుందామని కలలు కన్నారు. 2019 ఎన్నికలలో ఏపీలో భారీగా సీట్లు సంపాదించేసి, కేసుల్లో కొట్టుమిట్టాడుతున్న వైసీపీని ఓ మూలన కూర్చోపెట్టి అధికారం చెలాయించాలని ఊహించారు. అయితే వాళ్ళ ఊహలన్నీ ఉప్ఫుమని ఎగిరిపోయాయి. కేంద్రం నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకోవడం వాళ్ళిద్దరి నెత్తిన తాటికాయలా మారింది.

 

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకోవడం అనేది కేవలం ఏపీ రాష్ట్రానికి మాత్రమే సంబంధించిన అంశం కాదు... అది కేంద్ర ప్రభుత్వం మీద భారీగా ప్రభావం చూపించే అంశం. కేంద్రంలో బీజేపీని పూర్తి మెజార్టీ వున్నప్పటికీ,  చాలా మిత్రపక్షాలు ప్రభుత్వంలో భాగస్వాముల్లా వున్నాయి. ప్రస్తుతం బీజేపీ హవా నడుస్తోంది కాబట్టి ఆ పార్టీలన్నీ అవమానాలు ఎదురవుతున్నా భరిస్తూ పడి వున్నాయి. మిస్టర్ క్లీన్‌గా పేరు వుండటంతోపాటు, జాతీయ స్థాయిలో గౌరవం వున్న చంద్రబాబు లాంటి నాయకుడు ఇప్పుడు బీజేపీకి ఎదురు తిరగడం ఒక పెద్ద మలుపు. ఇది మిగతా పార్టీల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే శివసేన బీజేపీ అంటేనే అగ్గిమీద గుగ్గిలమవుతూ వుంటుంది. మరికొన్ని మిత్రపక్ష పార్టీలకు బీజేపీ అంటే కోపం వున్నా ఇప్పటి వరకూ బయట పడలేని పరిస్థితిలో వున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో నుంచి బయటకి వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో మరికొందరు భయాన్ని వదలి బయటపడే అవకాశాలున్నాయి. అది 2019 ఎన్నికల్లో బీజేపీ మీద తీవ్ర ప్రభావం చూపించడం ఖాయం... ఇవన్నీ గ్రహించే నరేంద్ర మోడీ, అమిత్ షా కలవరపడుతున్నట్టు సమాచారం.