ఆంధ్రాతో అనవసరంగా పెట్టుకున్నాం..

 

బీజేపీ రాజకీయాలు, నరేంద్ర మోడీ వ్యూహాలు, అమిత్ షా ఆలోచనలు దేశ రాజకీయాల్లో బాగానే వర్కవుట్ అవుతున్నాయి. కేంద్రంలో అధికారంలోకి రావడానికి, ఇప్పుడు పలు రాష్ట్రాల్లో అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి వీరి ప్లానులన్నీ బాగానే వర్కవుట్ అయ్యాయి. ఇదే తరహా ప్లాన్స్ ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రయోగించి విజయం సాధించాలని అనుకున్న కమల నాథుల పథకాలు బెడిసికొట్టినట్టే ప్రస్తుత పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో మిత్రపక్షంగా వుంటూనే టీడీపీకి వ్యతిరేకంగా పనిచేసి అధికారంలోకి రావాలని బీజేపీ వేసిన ప్లాన్ అట్లర్ ఫ్లాప్ అయినట్టు కనిపిస్తోంది. అధికారంలోకి రావడం సంగతి అటుంచితే, ఏపీ ప్రజల్లో నమ్మకాన్ని బీజేపీ పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది... ఇప్పుడు ఏపీలో మారిపోయిన పరిస్థితులను చూస్తున్న బీజేపీ కేంద్ర నాయకత్వం ఆంధ్రాతో అనవసరంగా పెట్టుకున్నాం అని పశ్చాత్తాప పడుతున్నట్టు తెలుస్తోంది.

 

ప్రత్యేక హోదా విషయంలో ఐదేళ్ళు కాదు.. పదేళ్ళు అని పార్లమెంటులో చాలా నమ్మకంగా చెప్పిన బీజేపీ నాయకత్వం ఇప్పుడు ఐదేళ్ళ సంగతి దేవుడెరుగు... ప్రత్యేక హోదా అనే హామీనే గుర్తు లేనట్టు వ్యవహరించడాన్ని ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి అందాల్సిన నిధులను కూడా సక్రమంగా అందించకపోవడం కూడా ఏపీ ప్రజలకు రుచించడం లేదు. ఇవన్నీ ఇలా వుంటే, ఆంధ్రాకి సాయం చేయకపోగా స్థానిక బీజేపీ నాయకులచేత రాజకీయాలు చేయించడం కూడా ఏపీ ప్రజలకు నచ్చడం లేదు. టీడీపీ మీద రాజకీయంగా ఆధిపత్యం సాధించి, వచ్చే ఎన్నికలలో అధికారం పొందాలన్న ఉద్దేశంతోనే కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ నాటకాలు ఆడుతోందని ఏపీ ప్రజలు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎంతగా సర్దుకుపోవాలని ప్రయత్నించినా బీజేపీ రెచ్చగొట్టేట్టు వ్యవహరిస్తోందనే విషయాన్ని ఏపీ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇన్నిరకాలుగా ఏపీ ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకున్న బీజేపీ ఇప్పుడు పునరాలోచనలో పడింది.

 

ఆంధ్రాతో అనవసరంగా పెట్టుకున్నామన్న విషయాన్ని ఆలస్యంగా అర్థం చేసుకున్న బీజేపీ ఇప్పుడు దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. జగన్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని బీజేపీ అర్థం చేసుకునే నాటికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని బీజేపీ కేంద్ర నాయకత్వానికి అర్థమైంది. అందుకే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో స్నేహాన్ని పెంచుకోవడానికి, జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసి చాలా స్నేహపూర్వకంగా మాట్లాడారు. స్థానిక బీజేపీ నాయకులు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం బాగా తగ్గించారు. ఏపీ ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేకతను తొలగించాలంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఎలా వుంటుంది... ఇప్పుడున్న పరిస్థితులో అందుకు చట్టపరంగా ఏ మార్గంలో వెళ్ళాలనేది కేంద్రం ఆలోచనలో వున్నట్టు సమాచారం. అందుకే అన్నారు... అడుసు తొక్కనేల... కాలు కడగనేల అని..!