మోడీ చెప్పినా వేస్ట్... అంబేద్కర్‌,మోడీ బ్రాహ్మణులంటా...


వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో అన్ని పార్టీల నేతలతో పోల్చుకుంటు బీజేపీ నేతలు కాస్త ముందుంటారన్న విషయం ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించారు. ఒకప్పుడంటే ఫుల్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి ఏం మాట్లాడినా.. ఏం చేసినా అంత ఫోకస్ పెట్టలేదు ఎవరూ. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. దేశ వ్యాప్తంగా బీజేపీ పై వ్యతిరేకత బాగా పెరిగిపోయింది. కాస్త తేడాగా ఏం మాట్లాడినా ఒకటే కామెంట్లు చేస్తున్నారు. అలా ఈ మధ్య చాలామంది నేతలే బుక్కయ్యారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడేముందు ఆచితూచి మాట్లాడాలని ఆదేశించారు.

 

కానీ మోదీ హితబోధ చేసినప్పటికీ బీజేపీ నాయకుల తీరు మాత్రం మారడం లేదు. త్రిపుర సీఎం విప్లవ్ దేవ్  డయానా హెడెన్ తెల్లగా లేకపోయినా ఆమెకు ప్రపంచ సుందరి కిరీటం ఎలా ఇచ్చారని, ఉద్యోగాన్వేషణ కోసం సమయం వృథా చేసుకోకుండా ఆవులు, పందుల పెంపకం ద్వారా ఉపాధి పొందాలని, పాన్ షాపులు పెట్టుకోవాలంటూ విప్లవ్ దేవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపారు. ఇప్పుడు తాజాగా గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఉద్యోగ మేళాలో పాల్గొన్న త్రివేది మాట్లాడుతూ... ‘బ్రాహ్మణులు దేవుళ్లను తయారు చేస్తారు. క్షత్రియుడైన రాముడిని, ఓబీసీ అయిన కృష్ణుడిని దేవుడిని చేసింది బ్రాహ్మణులే’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అంబేద్కర్‌ కూడా బ్రాహ్మణుడేనని, ఆయన ఇంటి పేరు చూస్తే అర్థమవుతుందని.. ఆయనకు ఆ పేరు పెట్టింది కూడా బ్రాహ్మణుడైన ఒక ఉపాధ్యాయుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ కూడా బ్రాహ్మణుడని చెప్పడానికి నేను గర్వపడతానంటూ వ్యాఖ్యానించారు. ఇక రాజేంద్ర త్రివేది వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ ఎంపీ ఉదిత్‌ రాజ్‌.. స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌, ప్రధాని మోదీలను బ్రాహ్మణులంటూ అభివర్ణించిన త్రివేది వల్ల పార్టీకి నష్టం కలుగుతోందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక జరగాల్సింది జరిగిన తరువాత ఇప్పుడు కవర్ చేసుకునే పనిలో పడ్డారు త్రివేది.  ‘కులం అనేది మనిషి పుట్టుక మీద కాకుండా అతడు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. భవద్గీత ప్రకారం విఙ్ఞానం ఉన్న వ్యక్తులు బ్రాహ్మణులు’ అంటూ కవరింగ్ చేసుకొచ్చారు.