TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీజీ.. ఈ మాత్రం అయినా చేస్తున్నారు...

Published on: Wed Jan 24, 2018 4:03PM

 

రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ ఏం చేసినా.. చేయక పోయినా ఓ విషయంలో మాత్రం రెండు రాష్ట్రాలకు కాస్త ఊరట కలిగించే పని ఒకటి చేయనున్నారు. ఇంతకీ అదేంటనుకుంటున్నారా...? అదే అసెంబ్లీ సీట్ల పెంపకం. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపకంపై ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై ఎన్నో సార్లు మోడీతో మన ఇద్దరు చంద్రులు గత కొద్దికాలంగా చర్చిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా  ఈ విషయంలో మొదటి అడుగు పడినట్టు తెలుస్తోంది.

 

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించిన ఫైలు కేంద్ర హోం శాఖ కొంత సమాచారం కోరుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు తాజాగా పంపినట్టు తెలుస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల అమలుపై ఈసీ తన అభిప్రాయం చెప్పాలని అందులో కోరింది. ఇక దీనిపై ఎన్నికల కమిషన్‌ తన అభిప్రాయం 3-4 రోజుల్లో చెప్పనుంది. ఆ అభిప్రాయం వచ్చాక మరో 4 శాఖలకు కూడా హోం శాఖ ఇటువంటి లేఖలు రాయాల్సి ఉంది. వారి నుండి సమాధానాలు వచ్చాక అన్నిటినీ కలిపి ఓ నిర్ణయానికి వస్తారు. వాటిని ప్రధాని ఆఫీసు ఆమోదించాక దీనిని కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందు పెడతారు. ఒకసారి కేబినెట్‌ ఆమోదంతో అది పార్లమెంటు ముందుకు వెళ్తుంది. ఇక అక్కడ కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే ఇద్దరు చంద్రుల కోరిక తీరినట్టే. మరి ఈ ప్రాసెస్ అంతా జరగాలంటే మరి కొంత సమయం పడుతుంది కదా. ఒకవేళ కేబినెట్ ఆమోదం లభించినా పార్లమెంట్లో ఆమోదం లభించాలి కదా..? మరి ఏం జరుగుతుందో.. వచ్చే ఎన్నికల లోపు ఈ ప్రక్రియ ముగుస్తుందో లేదో... చూద్దాం...