కలిసింది అందుకేనా..!కలరింగ్ ఇచ్చినా వర్కవుట్ కాలేదా..!

 

ఈ మధ్య ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా తయారవుతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఎవరెవరూ పొత్తుతో బరిలోకి దిగుతారు...అసలు పొత్తు పెట్టుకుంటారా..? ఒంటరిగా బరిలో దిగుతారా..? అబ్బో ఎన్నో అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ-బీజేపీ పార్టీలు మిత్రపక్షంగా ఉన్నా... ఈమధ్య రెండు పార్టీల మధ్య విబేధాలు తెలత్తుతూనే ఉన్నాయి. బీజేపీ నేతలు ఏదో ఒక కారణంతో...టీడీపీని విమర్శించడం...దీనికి టీడీపీ నేతలకు కోపం రావడం.. చంద్రబాబు వారిని వారించడం.. దానికి గాను నేతలు ఏం చేయలేక లోలోపలే ఆగ్రహాన్ని అణుచుకోవడం.. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల పొత్తుపై  ఇప్పటినుండే అనుమానాలు ఉన్నాయి. అంతేకాదు మరోవైపు టీడీపీ, జనసేనతో కలిసే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇక టీడీపీతో బీజేపీకి వస్తున్న విబేధాలను వైసీపీ క్యాష్ చేసుకోవాలని ఎప్పటినుండో చూస్తుంది. అందుకే బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాస్తుంది. గతంలో మోడీ జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో అది నిజమే అనుకున్నారు కూడా అందరూ.

 

అయితే ఆ తరువాత నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడం... వైసీపీ చిత్తుగా ఓడిపోవడం ఆ తరువాత బీజేపీ తోక ముడవడం అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా... వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రదాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మోడీతో భేటీ అవ్వడంతో.. మరోసారి హాట్ టాపిక్ అయింది. శుక్రవారం కోర్టులో హాజరు అవ్వాల్సి ఉన్నా.. రాజ్యసభకు వెళ్లాలని పర్మిషన్ తీసుకుని ఆయన ప్రధానిని కలిశారు. అయితే అత్యంత రహస్యంగా ఉన్నా...ఈ భేటీ బయట పడటంతో... ఇప్పుడు దానిని కవర్ చేసుకునే పనిలో పడ్డారు. ప్రధాని మోడీకి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పడానికి, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినందుకు మోదీకి అభినందనలు తెలపడానికి వెళ్లాని కలరింగ్ ఇస్తుంది తమ ఛానల్. అయితే ఇవేమీ కాదు.... వైసీపీతో బీజేపీ పొత్తు అంశంపైనే ఎక్కువగా చర్చించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.  జగన్ పాదయాత్ర ఏ విధంగా సాగుతోంది. ఆయన పాదయాత్రకు ఏ రకమైన స్పందన వస్తోందనే విషయాలను కూడా ప్రధానికి విజయసాయిరెడ్డి వివరించినట్టు సమాచారం.

 

దీంతో...  బీజేపీ విజయానికి విజయ సాయి రెడ్డి శుభాకాంక్షలు చెప్పడం ఏంటో? పాదయాత్ర విశేషాలు మోడీకి ఎందుకు? జగన్ ఎమన్నా బీజేపీ నాయకుడా? లేకపోతే కనీసం వైకాపా బీజేపీ ఒక కూటమిలో ఉన్నాయా? మోడీకీ జగన్ యాత్ర విశేషాలతో పనేముంది? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. మొత్తానికి వైసీపీ ఏదో కవర్ చేయడానికి ప్రయత్నించినా... కారణం మాత్రం అందరికీ అర్దమైపోతుంది. నిజంగా బీజేపీతో పొత్తు ప్రయత్నాలు చేస్తే అది తప్పేమి కాదు. రాజకీయాల్లో అవన్నీ కామనే. మరి అందులో దాచుకోవాల్సిన పనేం లేదు. వైసీపీ బయటకు చెప్పుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. కాస్తో కూస్తో భయపడితే బీజేపీ భయపడాలి. ఎందుకంటే వైసీపీకి అవినీతి మరకలు ఉన్నాయి కాబట్టి. మరి చూద్దాం.. వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు. ఎవరితో పొత్తు పెట్టుకుంటారో..