మోడీజీ.. ఈ లొల్లి అవసరమా...

 

ఎంత తెలివిమంతుడైనా ఏదో ఒక చిన్న పొరపాటు చేసి బుక్ అవుతుంటాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులు చేసే చేతలు కానీ.. మాట్లాడే మాటలు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు అలాంటి చిక్కుల్లోనే పడ్డారు ప్రధాని మోడీ. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్, కాంగ్రెస్ పై బీజేపీ దుమ్మెత్తి పోసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే మోడీ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూ పాకిస్థాన్ ను మధ్యలోకి తెచ్చి నోరు జారారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో గెలుపొందేందుకు కాంగ్రెస్ కు పాక్ సాయం చేస్తోంద‌ని మోడీ ఆరోపించారు. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్ ఇంట్లో ఇందుకోసం ఓ భేటీ జ‌రిగింద‌ని, పాక్ మాజీ అధికారులు, నేత‌లతో పాటు..భార‌త మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ కూడా ఈ భేటీలో పాల్గొన్నార‌ని, ఇది అనేక సందేహాల‌ను క‌లిగిస్తోంద‌ని మోడీ వ్యాఖ్యానించారు. దీంతో మోడీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇప్పటికే మోడీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. మోడీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ‌కీయ ల‌బ్దికోసం మోడీ ఇలాంటి అస‌త్య ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఈ ఆరోప‌ణ‌లు త‌న‌ను చాలా బాధించాయ‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.  మోడీ ఈ విష‌యంపై క్ష‌మాప‌ణ చెప్పాలని డిమాండ్ చేశారు.

 

అంతేనా ఒక్క కాంగ్రెస్ నుండే కాదు... ఇతర పక్షాల నుండి కూడా తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక మిత్రపక్షంగా ఉన్నా బీజేపీపై విమర్శలు చేసే శివసేన అయితే మోడీపై విరుచుపడింది. దేశ‌రాజ‌కీయాల స్థాయిని మోడీ దిగ‌జార్చార‌ని.. మోడీ త‌నంత‌ట తానే త‌న స్థాయిని త‌గ్గించుకుంటున్నార‌ని అభిప్రాయ‌ప‌డింది. గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో మొఘ‌ల్ సామ్రాజ్య స‌మాధుల‌ను మోడీ త‌వ్వార‌ని ఆరోపించింది. ప్ర‌చార స‌భ‌ల్లో మోడీ తీవ్ర భావోద్వేగంతో దూకుడుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని, ఆయ‌న గుజ‌రాత్ ఊబిలో చిక్కుకుపోయార‌ని విమ‌ర్శించింది. మరి మోడీ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతైనా ఆలోచించాల్సిన విషయమే. ఏదో చిన్నా చితకా నేతలు అయితే అనుకోవచ్చు... కానీ ఒక దేశానికి ప్రధాని అయిన మోడీ ఓటమి భయంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయనకు సరైంది కాదు అని అభిప్రాయపడుతున్నారు. మరి దీనిపై మోడీ ఎలా స్పందిస్తారో చూద్దాం...