నేను పీఎం కావడం తట్టుకోలేకపోతున్నారు...ఈ నెల 12న నిరాహారదీక్ష

 

ఏపీ ప్రత్యేక హోదాపై నిన్నటి వరకూ పార్లమెంట్లో ఏపీ ఎంపీలందరూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏపీకి మద్దతుగా.. మోడీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షపార్టీలన్నీ కలిసి ఏకతాటిపైకి వచ్చాయి. ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగాలని ఈ పార్టీలన్నీ పోరాడిన చర్చ మాత్రం జరగలేదు. ఇక ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంపై మోడీ స్పందించారు.  బీజేపీ 38వ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...  ఓబీసీ వర్గానికి చెందిన, పేద తల్లి కుమారుడినైన తాను ప్రధాని కావడాన్ని చూసి తట్టుకోలేక పోతున్నారని... వెనుకబడిన కులాల్లో పుట్టిన వారు కూడా ఉన్నత స్థానాలకు చేరుకోగలరన్న విషయాన్ని అంగీకరించలేక పోతున్నారని చెప్పారు.

 

ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపైనా పలు విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అంతమొందిస్తోందని.. పార్లమెంటు ప్రతిష్టను దిగజార్చుతోందని విమర్శించారు. పార్లమెంటు కార్యక్రమాలు జరగకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్న తీరును నిరసిస్తూ... తాను ఈ నెల 12న నిరాహారదీక్ష చేపట్టబోతున్నానని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెబుతున్నప్పుడు... తనను విపక్ష సభ్యులు దాదాపు చుట్టుముట్టినంత పని చేశారని అన్నారు. పార్లమెంటులో ప్రధాని ప్రసంగిస్తుంటే ఇలాగేనా వ్యవహరించేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటన ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదని చెప్పారు. అలాంటి పార్టీలను బీజేపీ ఎంపీలంతా ఎండగట్టాలని సూచించారు.