తూచ్! మోడీ బాగానే పని చేసాడు

 

పౌరుషానికి పోయేవాడు రాజకీయాలకి పనికిరాడు. ఛీ కొట్టిన వారిని కడుపు రగిలిపోతున్నా చిరునవ్వుతో కాగలించుకోగలగాలి, దోస్తీలను అవసరం తీరగానే కత్తిరించుకోగలగాలి.

 

ప్రధాని కావాలని కలలు కంటున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ జాతీయ దృక్పధం కనబరచకుండా, ఉత్తరాఖండ్ బాధితులలో కేవలం గుజరాతీలనే ఆదుకొని తన సంకుచిత మనస్తత్వం ప్రదర్శించుకొన్నాడని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే, తన పార్టీ పత్రిక ‘సామ్నా’లో రెండు రోజుల క్రితమే మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేవలం మోడీ మాత్రమే ఒక్కరోజులో 15,000 మంది గుజరాతీలను రాష్ట్రానికి తరలించాడని ఆయన వందిమాగాదులు చేసిన ప్రచారాన్నికూడా ఆయన చాలా తీవ్రంగా విమర్శించారు.

 

అయితే, ఇది జరిగిన రెండు రోజులకే మోడీ మహారాష్ట్ర పర్యటనకు రావడం, తనని ప్రసన్నం చేసుకొనేందుకు ఆయనే స్వయంగా ముంబైలో తన ‘మాతోశ్రీ’ కి వచ్చి కలవడంతో, ఉద్దావ్ థాకరే అభిప్రాయలు ఒక్కసారిగా మారిపోయాయి. తానూ మోడీని విమర్శించలేదని, ఆయన చేపడుతున్న సహాయ చర్యల గురించి, జరుగుతున్న ప్రచారాన్ని మాత్రమే ఖండిస్తూ వ్రాయడం జరిగిందని ఆయన సంజాయిషీ ఇచ్చుకొన్నారు. ఇక, మోడీ కూడా తనను తూర్పారబట్టిన ఉద్దవ్ థాకరే మద్దతు తన కలలు సాకారం చేసుకోవడానికి ఎంతయినా అవసరమని గ్రహించడం చేత, మొహమాటపడకుండా వెళ్లి ఉద్దవ్ ధాకరేని కలిసి వచ్చారు. ప్రస్తుతానికి ఇద్దరూ గుజరాతీ, మరాటీ భాయి భాయి అనుకొంటూ ఒకరినొకరు బాగానే కాగలించుకొన్నపటికీ ఆ సఖ్యత ఎంతకాలం నిలుస్తుందో చూడాలి.