బీజేపీ సామూహిక రాజీనామాలు... బీజేపీ తప్పు చేస్తుందా..!

 

మూడు రోజులుగా జరుగుతున్న కర్ణాటక రాజకీయ డ్రామాలకు తెరపడింది. కర్ణాటక ఎన్నికల్లో హంగ్ ఏర్పడంతో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంకోసం చేసిన పోరులో ఎట్టకేలకు కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ 104 సీట్లు గెలిచినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోకపోవడంతో అధికారం చేపట్టే అవకాశం చేజార్చుకుంది. అసెంబ్లీ బలపరీక్షలో ఎలాగైనా గెలవాలని బీజేపీ విశ్వప్రయత్నాలే చేసింది. దీనిలో భాగంగానే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తమవైపుకు లాగడానికి బేరసారాలకు సైతం దిగింది. కానీ బీజేపీ ప్రయత్నాలు మాత్రం వర్కవుట్ కాలేదు. ఇక ఈరోజు ఇంకొద్ది సేపట్లో బలపరీక్ష జరుగుతుంది.. ఎవరు అధికారం చేపడతారో అని అందరూ ఎదురచూస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా యడ్యూరప్ప తమ పార్టీ నేతలతో చేసిన బేరసారాల వీడియో బయటపెట్టారు. దీంతో విషయం బయటపడటంతో మోడీ, అమిత్ షా యడ్యూరప్ప మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆఖరికి రాజీనామా కూడా ఆదేశించినట్టు తెలుస్తోంది. అందుకే అసెంబ్లీలో విశ్వాస తీర్మానం పరీక్ష ముందే తమ ఓటమిని అంగీకరించి..ఉద్వేగంతో ప్రసంగం చేసిన యెడ్డీ తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

 

అయితే ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం ఒకటి తెరపైకి వచ్చింది. అదేంటంటే... కర్ణాటకలో అన్ని పార్టీల కంటే అధికంగా 104 ఎమ్మెల్యే సీట్లు వచ్చినా అధికారంలో రాలేకపోయామని బీజేపీ నాయకులు ఆవేదన చెందుతున్నారట. ఇక ఇప్పటికే యడ్యూరప్ప రాజీనామా చేయడంతో... 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్ భవన్ చేరుకుని గవర్నర్ వాజుబాయ్ వాలాకు సామూహిక రాజీనామా లేఖలు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆరు నెలల్లో మళ్లీ ఎన్నికలు జరగాలంటే బీజేపీకి చెందిన 104 మంది ఎమ్మెల్యేలు సామూహిక రాజీనామాలు చెయ్యాలని నిర్ణయించుకున్నారట. మరి ఇప్పుడు సామూహిక రాజీనామాలు చేసి మళ్లీ ఎన్నికలని మొదలుపెడితే ప్రజలు ఆదరిస్తారా..? అన్నది పెద్ద ప్రశ్న.. మరి ఇప్పటికే  బీజేపీపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత ఉంది. దానికితోడు కర్ణాటకలో బీజేపీ చేసిన రాజకీయాలవల్ల ఉన్న ఇమేజ్ కూడా పోయింది. దానికి  తోడు ఆడియో టేపులు బయటపడటం. అన్నీ బీజేపీకి ఎదురుదెబ్బలే తగిలాయి. అందుకే  ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ప్రజల ఆగ్రహం చవిచూడటం కంటే ప్రతిపక్షంగా ఉండటమే మంచిదని బీజేపీ పెద్దలు భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అంతా అయిపోయిన తరువాత మళ్లీ సామూహిక రాజీనామాలు అంటూ డ్రామాలు మొదలుపెడితే వర్కవుట్ అవుతుందా.. బీజేపీ మళ్లీ పప్పులో కాలేస్తుందని అని అభిప్రాయపడుతున్నారు రాజకీయ విశ్లేషకులు.