మోడీ చరిత్రలోనే బ్లాక్ డే..

 

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఇప్పటివరకూ మోడీ ఎన్నో పర్యటనలు చేసి ఉంటారు. ఎన్నో విదేశాలు తిరిగేసి ఉంటారు. కానీ ఈరోజు ఆయనకు జరిగిన అవమానం ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు. మోడీకి అవమానం జరిగింది ఎక్కడో కాదు...ప్రాంతీయతకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చే తమిళనాడు రాష్ట్రంలో. అసలు సంగతేంటంటే... డిఫెన్స్ ఎక్స్‌పో కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడీ చెన్నై వెళ్లారు. అయితే అక్కడ మోదీకి నిరసనలతో స్వాగతం లభించింది. కావేరీ నదీ జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని గత కొద్దికాలంగా తమిళనాడు రాష్ట్రంలో నిరసనలు జరుగుతున్న సమయంలో ఆయన చెన్నైకు రాగా... ఆయన రాకను నిరసిస్తూ, వేలాది మంది నిరసనలకు దిగారు. విమానాశ్రయం సమీపంలోనే ఆయన్ని అడ్డుకునేందుకు  పెద్దఎత్తున నిరసనకారులు ప్రయత్నించారు.

 

దీంతో ఇప్పటివరకూ ఎన్నడూ లేని విధంగా తమిళనాడులో మోడీకి చేదు అనుభవం ఎదురైందని అంటున్నారు. అంతేనా సోషల్ మీడియాలో అయితే మోడీపై సెటైర్లు మామూలుగా వేయలేదు తమిళ ప్రజలు. మీరు ప్రధానిగా పనికిరారని, ఇంతకు ముందు మీరు చేసిన టీ అమ్ముకునే పనే చేసుకోవాలని ఘాటుగా సోషల్ మీడియాలో సలహా ఇస్తున్నారు. మీ మొసలి కన్నీళ్లకు కరిగిపోవడానికి ఇది ఉత్తర భారతదేశం కాదని తమిళనాడు అని తమిళ ప్రజలు తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో హెచ్చరించారు. ఇంకా ఆశ్చర్యకమైన విషయం ఏంటంటే... మోడీ గో బ్యాక్ అనే నినాదాలు సోషల్ మీడియా ట్రెండింగ్ లో భారత్ నెంబర్ 1గా, ప్రపంచ వ్యాప్తంగా నెంబర్ 4 స్థానంలో ట్రెండింగ్ లో నిలిచింది. నిజంగా ప్రధానిగా మోడీకి ఏప్రిల్ 12వ తేదీ గురువారం బ్లాక్ డే అని, ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని తమిళ ప్రజలు అంటున్నారు.

 

ఇంకా కొంతమంది అయితే ఏకంగా...ప్రధాని పదవికి మోడీ  అనర్హుడు వెనక్కి వెళ్లిపోండి...మీరు మళ్లీ టీ అమ్మడం మొదలుపెట్టండి. మీరు టీ అమ్మడానికి కచ్చితంగా సరిపోతారు, ముందు ఆ పని చెయ్యండి అంటూ ట్వీట్లు పెడుతున్నారు. ముల్లును ముల్లుతోనే తియ్యాలి.. మీ ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మీరు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటారు. మీ మీద వ్యతిరేకతను తెలియజేయడానికి మేము కూడా అదే సోషల్ మీడియానే ఉపయోగించాము.. అంటూ కౌంటర్ల మీద కౌంటర్లు విసురుతున్నారు. ఇంకా దారుణం ఏంటంటే...  మోడీ తమిళనాడుకు రావడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ఓ ఆందోళన కారుడు ఏకంగా ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఒంటిమీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తానికి మోడీకి ఇన్ని రోజులకు దక్షిణాది రాష్ట్రాల సెగ తగిలినట్టుంది. దక్షిణాది రాష్ట్రాలే కదా అని చిన్న చూపు చూస్తున్న ఆయనకు... వారు తిరగబడితే ఎలా ఉంటుందో తెలిసొచ్చింది.