ఇంతలోనే ఎంత మార్పు...

 

కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.... ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవుతుంటాయి. ప్రధాని నరేంద్ర  మోడీ పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది ఇప్పుడు. గతంలో కనీసం చంద్రబాబుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని మోడీ గారు.. ఇప్పుడు ఏకంగా చంద్రబాబుతో తానే భేటీ అవుతానని చెప్పడం చూస్తుంటే.. అదే అనిపిస్తుంది. నాలుగేళ్లలో ఎంత మార్పు వచ్చింది.. ముందున్న మోడీకి ఇప్పుడున్న మోడీ వైఖరిలో చాలా మార్పే వచ్చింది. దీనికి కారణం ఏదో  ఆయనకు సడెన్ గా ఏపీ మీద ప్రేమ పుట్టుకొచ్చిందో.. లేక చంద్రబాబు మీద ప్రేమ పుట్టుకొచ్చిందో అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.

 

నాలుగేళ్ల క్రితం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం..ఇప్పటివరకూ అచ్చంగా ఆకాశంలో విహ‌రిస్తూ వచ్చింది. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా.. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీకే పట్టంకట్టడంతో పార్టీకి రెక్కలు వచ్చినంత పనైంది. అందుకే మోడీ, షా ద్వయం వారికి నచ్చినట్టు నిర్ణయాలు తీసుకొని కావాల్సినంత వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నోట్ల రద్దు అయితేనేం.. జీఎస్టీ అయితేనేం.. ఇంకా దళితులపై దాడులు ఇలా అనేక అంశాలపై బీజేపీ తీరును చూసి ప్రజలు మండిపడ్డారు. అందుకే రాను రాను బీజేపీపై, ముఖ్యంగా మోడీపై ఉన్న విశ్వాసం సన్నగిల్లింది. ఫైనల్ గా తన సొంత రాష్ట్రమైన గుజరాత్ ఎన్నికలు చెంప మీద కొట్టినట్టు సమాధానం చెప్పాయి.

 

ఇక ఏపీ రాజకీయాల్లోకి వస్తే... మొన్నటివరకూ అసలు ఏపీ అంటేనే చాలా చిన్నచూపు చూశారన్న విషయం ఏ ఒక్కరిని అడిగినా చెబుతారు. ప్రత్యేక హోదా విషయంలో కానీ, నిధుల సాయంలో కానీ, ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టడం కానీ ఇలా ఏపీని ఎప్పుడూ చిన్న చూపు చూస్తునే వచ్చారు మోడీ. అవ్వడానికి టీడీపీ, బీజేపీ మిత్రపక్షమైనా... ప్రతిపక్షంలాగా ఎప్పుడూ బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపైన ఏదో ఒకటి విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఎంతైనా మిత్రపక్షమే అని చంద్రబాబు సైలెంట్ గా ఉంటే విమర్శల తీవ్రత మరీ పెరిగింది. అంతేనా ఒకానొక సందర్బంలో వైసీపీతో జట్టుకడతారన్న వార్తలు కూడా వచ్చాయి. చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా... జగన్ అండ్ బ్యాచ్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడంతో ఈ వార్తలు నిజమే అని అనుకున్నారు అందరూ. కానీ నంద్యాల ఉపఎన్నిక, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలతో రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి మోడీకి అర్ధమైంది ఇక గుజరాత్ ఎన్నికలైతే మోడీకి పెద్ద గుణపాఠమే నేర్చించాయని చెప్పొచ్చు. ఇదే ఆయనలో మార్పుకు కారణం. మోడీని టీడీపీ,బీజేపీ ఎంపీలు కలిసిన నేపథ్యంలో... తాను ఈ విషయాలపై చంద్రబాబుతో మాట్లాడుతానని చెప్పారట. అంతేకాదు… ఎంపీలతో ఏపీకి సంబంధించిన ఎన్నో విష‌యాల‌పై మోడీ అత్యంత సానుకూలంగా మాట్లాడరట. తాను, చంద్ర‌బాబు క‌లిసిన‌ప్పుడు పెండింగ్ అంశాల‌న్నింటిని చ‌ర్చించి ఏపీకి అన్ని విధాలా న్యాయం చేస్తామ‌ని హామీ కూడా ఇచ్చారట. మొత్తానికి గుజరాత్ ఎన్నికలు మోడీలో మంచి మార్పునే తీసుకొచ్చాయి అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అంతేకాదు మిత్ర‌ప‌క్షాల‌ను దూరం చేసుకోకూడ‌ద‌న్న పాఠం కూడా నేర్పాయి అంటున్నారు. ఏదిఏమైనా మోడీగారిలో మార్పు రావడం ఆనందించాల్సిన విషయమే.