మూడేళ్ల మోదీ : భారతీయ రాజకీయ బాహుబలేనా?

 

నెహ్రు, ఇందిరా, రాజీవ్… వీళ్లకు భారతీయ ప్రజాస్వామ్య చరిత్రలో ప్రత్యేక స్థానం వుంది. తొలి ప్రధాని కావటంతో నెహ్రుకి, బలమైన ప్రజాకర్షణ వుండటంతో ఇందిరకి, ఆమె కొడుకుగా జనంలో వున్న ఇమేజ్ తో రాజీవ్ కి బోలెడు ఓట్లు పోలయ్యేవి. అందుకే, నెహ్రు, ఇందిరా, రాజీవ్ లకు వచ్చినంత మెజార్టీ మరెవ్వరికీ రాలేదు పార్లమెంట్ చరిత్రలో. కాని, సరిగ్గా మూడేళ్ల కిందట ఇదే రోజున మోదీ కూడా ఆ లిస్ట్ లో చేరారు! స్వంత మెజార్టీతో దిల్లీ పీఠం కైవసం చేసుకున్నారు. అంతకంటే ముఖ్యంగా సంపూర్ణ మెజార్టీతో ప్రధాని పదవి సంపాదించిన తొలి కాంగ్రేసతర పీఎంగా చరిత్ర సృష్టించారు! మరి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత పుట్టిన ఈ అసలు సిసలు భారతీయ ఆత్మవిశ్వాసపు సంకేతం మూడేళ్లలో ఏం చేశారు? నమోపైన దేశంపైన మూడ్ ఎలా వుంది?

 

అయిదేళ్ల పదవి కాలంలో మూడేళ్లు పూర్తయ్యాయంటే… కౌంట్ డౌన్ మొదలైపోయినట్టే. జనం వేచి చూసే ధోరణి నుంచి ఆశించే స్థితికి వస్తారు. ఫలితాలు అనుభవంలోకి రావాలనుకుంటారు. హామీలు అమలు కావాలని కోరుకుంటారు. రాబోయే ఎన్నికల్లో తమ ఓటు ఎవరికో ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటూ వుంటారు! అయితే, అనేక సర్వేలు చెబుతోన్న సారం … మోదీపై ప్రయోగించేందుకు జనం తమ ఓట్లనేం సానబెట్టటం లేదట! ఆయనకు అనుకూలంగానే ఇంకా 60శాతానికి పైగా జనం వున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ సర్వేల్నే కాదు… అతి పెద్ద యూపీ సహా అతి చిన్న గోవా వరకూ దేశం నలుమూలల్లో బీజేపి బలపడుతుండటం… మోదీ మ్యానియాని నమ్మేలాగే చేస్తోంది! డెమోక్రసీలో ఈవీఎంల వద్ద సత్తా చాటడమే అంతిమ విజయం కదా…

 

మోదీ వచ్చాక అరవై ఏళ్ల కాంగ్రెస్ మార్కు పాలనకి భిన్నమైన వాతావరణం వస్తుందని అంతా ఆశించారు. అయితే, కొందరు నమో వ్యతిరేకులు ఇప్పటికీ అసంతృప్తులుగానే వున్నా మొత్తం మీద మాత్రం కాంగ్రెస్ తరహా పాలన ఇప్పుడు లేదని భావిస్తున్నారు. అందుకే, అవినీతి, కుంభకోణాల మాట లేని మోదీ సర్కార్ జనంలో క్రేజ్ తగ్గకుండా సాగుతోంది. డీమానిటైజేషన్ లాంటి ఇబ్బందిని కూడా మోదీ మీద నమ్మకంతో, ఆయన నిజాయితీ పట్ల విశ్వాసంతో జనం భరించారు. నోట్ల రద్దు కష్టాల సమయంలో ప్రజల వైపు వున్నామని భ్రమించిన ప్రతిపక్షాలకే వరుస ఎన్నికల్లో బుద్ది చెబుతున్నారు. ఇదే తంతు విదేశాంగ విధానంలో కూడా మోదీ విషయంలో జరుగుతోంది. ఆయన భారత్ లో కంటే ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా వుంటున్నాడని గోల చేసిన పార్టీలు, నేతలు, మీడియాలు… అన్నిట్ని, అందర్నీ లైట్ తీసుకున్నారు ఇండియన్స్! సరదాగా ఎంజాయ్ చేసి రావటానికి మోదీ విదేశాలకు వెళ్లడని నమ్మారు. పాక్ విషయంలో ఇప్పుడు అది నిజమైంది కూడా. పదే పదే మనల్ని కవ్వించి జవాన్లను బలి తీసుకుంటున్నా పాక్ అంతర్జాతీయ సమాజంలో ఏకాకి అయింది. మోదీ చాణక్యంతో ఇరాన్ మొదలు అమెరికా వరకూ చాలా దేశాలు పాకిస్తాన్ కు వ్యతిరేకమైపోయాయి!

 

ప్రపంచం అంతా ఆర్దిక మందగమనంతో బాధపడుతోంటే కూడా ఇండియాలో పెట్టుబడల ప్రవాహం ఆగలేదు. భారీగా ఉద్యోగాలు ఊడి ఇండియన్స్ రోడ్డున పడలేదు. ఇది సాధారణ విషయం కాదు. అయితే, మోదీ వస్తే భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది అని, గుజరాత్ మోడల్ అమలు అవుతుందని ఆశించిన వారు డిజపాయింట్ అవ్వొచ్చు. కాని, సాధారణ జనం ఇంకా ముందు ముందు మంచి జరుగుతుందని నమ్ముతున్నారు. మూడేళ్లలోనే అద్భుతాలు జరుగుతాయని వారు కూడా ఆశించలేదు. డెబ్బై ఏళ్లుగా పేరుకుపోయిన మురికి అంతా ఈజీగా పోయేది కాదని కామన్ పీపుల్ ఫీలింగ్! మోదీకి ఇది కూడా బాగా కలిసొస్తోంది.

 

మోదీ మూడేళ్ల పాలనలో జనం నుంచి ఇంచూమించూ పాజిటివ్ రెస్పాన్స్ రావటానికి మరో ప్రధానమైన కారణం ప్రతిపక్షాల డ్రామా రాజకీయాలు. పూణే ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో విద్యార్థులు మొదలు దిల్లీ జేఎన్ యూలో కన్నయ్యా కుమార్ బ్యాచ్ వరకూ అందరికీ జైకొట్టారు పెద్ద పెద్ద నేతలు. మోదీని ఒక హిందూత్వ ఉన్మాదిగా చూపించే ప్రయత్నమే తప్ప ఆయన ప్రధానిగా ప్రదర్శిస్తోన్న పర్ఫామెన్స్ పై గంభీరంగా ఆరోపణలు చేసిన వారు ఎవ్వరూ లేరు. బీఫ్ రాజకీయాలే నమో పట్ల జనంలో వ్యతిరేకత తెచ్చిపెడతాయని బలంగా నమ్మారు సెక్యులర్ నేతలు. అది పూర్తిగా తప్పని తేలిపోయింది. మతోన్మాదం ఎంత దారుణమో అంతే దారుణం అవినీతి, బంధుప్రీతి, పారదర్శకత లేని పాలన అని నిరూపించారు ఓటర్లు.

 

మూడేళ్లలో మోదీ ఏం చేసినా జనం ఆమోదించారు కాబట్టి ఇక ముందు కూడా పూలబాటే అనుకోవటానికి వీలులేదు. అప్పుడే కొన్ని సర్వేలు 2019లో కూడా మోదీనే పీఎం అనేస్తున్నాయి. అవి నిజమో కాదో తెలియదుగాని… జనం ఎప్పటికప్పుడు తమ ఓటుకు పదునుబెట్టి ప్రయోగిస్తుంటారు. అందుకే, నరేంద్ర మోదీ కూడా రానున్న రెండు సంవత్సరాలు మరింత జాగ్రత్తగా వ్యవహరించి పేదల కళ్లలో ఆనందం తీసుకురావాలి. అదొక్కటే పోలింగ్ బూత్ కి వెళ్లేప్పుడు ఓటర్ల నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. మిగతాదంతా అప్రస్తుతమే!